అన్నదమ్ములిద్దరు పంచేసుకున్నారా?

Update: 2020-11-27 11:30 GMT
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో  అన్నదమ్ములిద్దరు పార్టీలను పంచేసుకున్నట్లే కనబడుతోంది. అవును ఇపుడు చెబుతున్నది ఎంఐఎం అగ్రనేతలు, సోదరుల గురించే. హైదరాబాద్ ఎంపి గా అసదుద్దీన్ ఓవైసి ఉన్న విషయం తెలిసిందే. తమ్ముడు అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్న 51 డివిజన్లలో తమ ప్రచారంతో సోదరులిద్దరు హోరెత్తించేస్తున్నారు.

ముఖ్యంగా గమనించాల్సిందేమంటే సోదరులిద్దరిలో ఒకరు బీజేపీని మరోకరు అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా ప్రచారంలో జోరు పెంచేశారు. అసుదుద్దీన్ ఏమో బీజేపీ పార్టీని నేతలను టార్గెట్ చేస్తు ప్రచారంలో రెచ్చిపోతున్నారు. కమలంపార్టీలోని ప్రతి ఒక్క నేతను పేరు పేరునా చెప్పి తీవ్రమైన ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. తన ప్రచారంలో చివరకు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా అసద్ వదిలిపెట్టలేదు. స్వయంగా మోడినే వచ్చి ప్రచారం చేసినా గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించోవటం బీజేపీ వల్ల కాదంటూ సవాలు విసిరారు.

ఇక తమ్ముడు అక్బరుద్దీన్ విషయం చూస్తే టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ను ఎలా అదుపు చేయాలో తమకు బాగా తెలుసంటూ పెద్ద వార్నింగే ఇచ్చారు. భారీవర్షాలకు గ్రేటర్ పరిధిలోని వందలాది కాలనీల్లోని ఇళ్ళు, జనాలు నీటముణిగిపోయినా టీఆర్ఎస్ పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశారు.  గడచిన ఆరేళ్ళల్లో అధికారంలోనే ఉన్న టీఆర్ఎస్ జనాల సంక్షేమానికి చేసిందేమీ లేదంటూ మండిపోయారు.

అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్ళను కూల్చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పేదల ఇళ్ళను కూల్చటం కాదని దమ్ముంటే  మాజీ ప్రధానమంత్రి పీవి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ సమాదులను కూల్చేయాలంటూ పదే పదే సవాలు విసిరారు.  తమతో పెట్టుకుంటే టీఆర్ఎస్ ను తొక్కిపడేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికలు మొదలైన దగ్గర నుండి టీఆర్ఎస్-ఎంఐఎం వేర్వేరు పార్టీలని, తమ మధ్య ఎటువంటి పొత్తులు లేదని చెప్పటానికి రెండు పార్టీల నేతలు అక్బరుద్దీన్, కేటీయార్ నానా అవస్తలు పడుతున్నారు. ఇక్కడ చిత్రమేమిటంటే సోదరిలిద్దరు కాంగ్రెస్, టీడీపీ లాంటి అనేక పార్టీలను అసలు పట్టించుకోవటమే లేదు.

అయితే వీళ్ళు మరచిపోయిందేమంటే వీళ్ళు ఒకళ్ళపై మరొకళ్ళు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసుకున్నా జనాలైతే నమ్మటం లేదు. దశాబ్దాల పాటు వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం జనాలందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పటికిప్పుడు తమ మధ్య పొత్తు లేదని వీళ్ళు చెబితే నమ్మేంత అమాయకులు ఎవరు లేరు. ఏదో సినిమాలో చెప్పినట్లుగా ‘నేను కొట్టినట్లు నటిస్తాను, నువ్వు దెబ్బలు తగిలి ఏడ్చినట్లు నటించు’ అన్నట్లే ఉంది వీళ్ళ వ్యవహారం. చూద్దాం ఎన్నికలై పోయిన తర్వాత ఏమి చేస్తారో ?
Tags:    

Similar News