ఇదీ.. దోవల్ ఫోన్ కాల్ ‘పెద్దన్న’ రియాక్షన్

Update: 2016-12-20 17:30 GMT
రీల్ లైఫ్ లో కనిపించే జేమ్స్ బాండ్ కు దేశీయ లుక్ ఇచ్చేసి.. రియల్ లైఫ్ కు తగ్గట్లు కాసిన్ని మార్పులు చేస్తే వచ్చే క్యారెక్టర్ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లా ఉంటుందనటంలో సందేహం లేదు. ఇప్పటికే తనదైన శైలిలో ఆయన చేసిన సాహసకార్యాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. మొన్నా మధ్య పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా దోవల్ వేసిన ప్లాన్ ఎంతలా వర్క్ వుట్ అయ్యిందో తెలిసిందే.

అలాంటి దోవల్ నుంచి వెళ్లే ఫోన్ కాల్ కు పెద్దన్న అమెరికా ఎంతగా రియాక్ట్ అవుతుందో తెలిపే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓపక్క ఆర్థిక సంస్కరణలతో పాలనా రథాన్ని పరుగులు తీయిస్తున్న కేంద్రం.. మరోవైపు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అందుకు తగ్గట్లుగా తన వైఖరిని ప్రదర్శిస్తోంది.

మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యమైన అమెరికాలో అధికార బదిలీ జరుగుతున్న సంగతి తెలిసిందే. డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్లకు పవర్ ట్రాన్సఫర్ కావటమే కాదు.. ఒబామా నుంచి ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ టీంలో జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వర్తించనున్న మైఖెల్ ప్లిన్ కు ఈ మధ్యన దోవల్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుకున్న వారిద్దరూ.. అమెరికాకు రావాల్సిందిగా దోవల్ ను ప్లిన్ ఆహ్వానించారు.

దీంతో.. అమెరికాకు వెళ్లిన దోవల్ కు ట్రంప్ బృందం రాయల్ ట్రీట్ మెంట్ ఇచ్చిందట. అత్యంత వేగంగా దూసుకెళుతున్న దేశంగా భారత్ ను అభివర్ణించిన ప్లిన్.. భారత ఆర్థిక వ్యవస్థను.. విలువలను తాము గౌరవిస్తామని చెప్పారట. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలు.. ఉమ్మడిగా అమలు చేయాల్సిన వ్యూహాల గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం కొలువు తీరక మీదే.. కొత్త స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News