బాబుతో పాటు పవన్‌ నూ ఉతికేసిన మరో మాజీ సీఎస్

Update: 2018-04-13 15:55 GMT
ఏడాది కిందట ఏపీ సీఎస్‌ గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లాం తాజాగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీ ఎత్తున సాగుతోందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయడం వెనుక కొందరి ప్రయోజనాలున్నాయన్నారు. అధికార వికేంద్రీకరణ ఎందుకు చేయడం లేదన్నారు. రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆయన ఆరోపించారు.
    
ఏపీలో అవినీతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ‘ఎవరి రాజధాని అమరావతి’ అంటూ మరో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పుస్తకం రాసిన మాదిరిగానే కల్లాం కూడా అమరావతిలో అవినీతికి సంబంధించి తాజాగా పుస్తకం రాశారు.
    
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద పెద్ద నగరాలు కట్టడంకాదు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగితేనే నిజమైన అభివృద్ధి. మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నది. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు. పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే. రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు’’ అని అన్నారు.
Read more!
    
మరోవైపు కల్లాం పవన్ కల్యాణ్‌ పైనా పరోక్ష విమర్శలు చేశారు. మేకప్‌లు వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారని... ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపిస్తున్నదని అన్న ఆయన యువత రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని సూచించారు. మొత్తానికి చంద్రబాబు పనితీరుపై మొన్నమొన్నటివరకు ఆయన ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్‌లు తీవ్ర విమర్శలు చేస్తుండడం.. పుస్తకాల రూపంలో వాస్తవాలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News