ఏపీకి ఏఐఐబీ షాకిచ్చిందా?... మరి ఇదేంటీ బాసూ

Update: 2020-02-07 05:10 GMT
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నంత కాలం ప్రపంచ బ్యాంకు సహాలు పలు బ్యాంకులు ఏపీకి అడిగినంత మేర రుణాలిచ్చాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే... ఆ బ్యాంకులన్నీ ఇచ్చిన రుణాలను కూడా రద్దు చేసుకుని వెనక్కు పరుగులు పెట్టాయా? ఈ దిశగా టీడీపీ అనుకూల మీడియా తాటికాయలంత అక్షరాలతో పేజీలకు పేజీలు వార్తలు వండి వార్చితే... టీడీపీ నేతలు ఏకంగా స్వైర విహారమే చేశారు. మరి గురువారం జరిగిన ఓ కీలక సమావేశం తాలూకు వివరాలను చూస్తే వారంతా ఇప్పుడు ఏమంటారో చూడాలి. గతంలో 200 మిలియన్ డాలర్లను ఏపీకి రుణం ఇచ్చేందుకు వచ్చి జగన్ రాకతో వెనుదిరిగిపోయిందని టీడీపీ ప్రచారం చేసిన ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ).. ఇప్పుడు పాత రుణానికి తోడుగా ఏకంగా 3 బిలియన్ డాలర్ల ను ఎలాంటి షరతులు లేకుండా అందజేసేందుకు ముందుకు వచ్చింది.

నిజమా? అంటే... నిన్న అమరావతి కి వచ్చిన ఏఐఐబీ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఆఫీసర్‌ పాండియన్, డైరెక్టర్‌ జనరల్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ యీ–ఎన్‌–పంగ్, ప్రిన్సిపల్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ సోమనాథ్‌ బసులు.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని వారు జగన్ కు తెలిపారు. అంటే గతంలో మంజూరు చేసిన 200 మిలియన్ డాలర్ల తో పాటుగా కొత్తగా 3 బిలియన్ డాలర్లను రాష్ట్రానికి రుణంగా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ రుణాలను రాష్ట్రప్రభుత్వం తన ప్రాధాన్య రంగాల్లో ఎక్కడైనా, ఏ రంగంలో అయినా ఖర్చు చేసుకోవచ్చంటూ కూడా సదరు బ్యాంకు అధికారులు తెలిపారు.

మరి పాత రుణంతో పాటు దానికి 15 రెట్ల మేర కొత్త రుణం కూడా ఇస్తామనం ఏఐఐబీ ఇప్పుడు చెబుతుంటే... అసలు రుణం రద్దు అయ్యిందని గతంలో టీడీపీ నేతలు, స్వయంగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఏ రీతిన కథనాలు రాశాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు గానీ, ఇతర ఏ బ్యాంకు అయినా అభివృద్ధికి నిధులిస్తే... ఫలానా ప్రాజెక్టులోనే ఖర్చు చేయాలని నిబంధనలు పెడుతుందంటూ చంద్రబాబు అండ్ కో చేసిన వాదనలోనూ పస లేదని స్పష్టంగా తేలి పోయిందనే చెప్పక తప్పదు. మొత్తంగా ఈ ఘటన టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ కాగా... వైసీపీకి మాత్రం డబుల్ బూస్టేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News