ఆగ్ని సీక్రెట్ ను అగ్రరాజ్యం.. అంత సింఫుల్ గా పట్టేసిందట

Update: 2020-06-10 10:30 GMT
ఒక చిన్న సమాచారం.. అత్యంత గోప్యంగా సాగే క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుందా? అంటే నో అనేస్తాం. కానీ.. అది ఏ మాత్రం నిజం కాదన్న వాస్తవం తాజాగా బయటకు వచ్చింది. ఒక సైంటిస్టు మారిన ఇంటి చిరునామా అగ్ని 2, ఆగ్ని 3 క్షిపణుల రహస్య స్థావరాన్ని కనుగొనేలా చేసినట్లు అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. తాజాగా జరిపిన ఒక అధ్యయన పత్రంలో భారత్.. చైనాలు సైనిక వ్యూహత్మక అడుగులు ఎలా ఉన్నాయన్న అంశంపై పరిశోధన చేశారు.

అందులో భాగంగా ఇంటర్నెట్ లో లభించిన ఒక చిన్న సమాచారం.. భారత్ లోని అగ్ని రహస్య స్థావరానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చేలా చేసిందని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అంటే 2010లో ఈశాన్య భారతంలో అగ్ని-2ను మొహరించే అంశాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ రహస్య స్థావరం కారణంగా పశ్చిమ.. మధ్య.. దక్షిణ చైనాలోని లక్ష్యాన్ని తాకే అవకాశం ఉంది.

దీంతో.. ఆ స్థావరం ఎక్కడ ఉందన్న విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశామన్నారు. ఇందులో భాగంగా భారత సైనిక అధికారి ఇంటి అడ్రస్ మారటం తమను ఆకర్షించిందని చెప్పారు. ఇంటర్నెట్ లో లభించే బహిరంగ డేటా నుంచి వివరాల్ని సేకరించామని.. అందులో ఆయన చిరునామా అసోంలోని నగావ్ కు మారినట్లుగా తేలింది. ఈ అధికారి 2017 వరకు అక్కడే ఉన్నట్లు తాము గుర్తించామన్నారు.

దీంతో.. అగ్ని రహస్య స్థావరం నగావ్ లో ఉన్నట్లు తమకు అర్థమైందన్నారు. అగ్ని-2 రెండు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని తాకే సామర్థ్యం ఉంటే.. అగ్ని-3కి మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో ఉండే లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉందన్నది మర్చిపోకూడదు. ఇంత సింఫుల్ గా కాలు బయటకు కదపకుండా.. ఇంటర్నెట్ లో ఉండే చిన్నసమాచారం.. మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా రహస్య స్థావరాన్ని గుర్తించే వీలు చిక్కిందని చెప్పుకొచ్చారు. సైనిక అంశాల్లో మరెంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News