అంత‌రిక్ష ప‌ర్యాటం త‌ర్వాత‌.. యాంటీ ఏజింగ్ పై పెట్టుబ‌డులు!

Update: 2021-09-08 08:30 GMT
ఇటీవ‌లే అంత‌రిక్ష ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌యోగాల‌ను విజ‌య‌వంతంగా సాగించి, స్పేస్ టూరిస్టుల‌ను పంపాయి కొన్ని కంపెనీలు. స్పేస్ టురిజం ముందు ముందు పెద్ద వ్యాపార మార్గం అవుతుంద‌ని అవి భావిస్తున్నాయి. అత్యంత భారీ పెట్టుబ‌డుల‌తో కూడిన ఈ వ్య‌వ‌హారంలో కాలు మోపిన వారిలో అమెజాన్ అధిప‌తి బెజోస్ కూడా ఉన్నారు. పోటాపోటీ అంత‌రిక్ష ప‌ర్యాట‌కంలో ఆయ‌న పెట్టుబ‌డులు పెట్టారు. ఇక ఆ త‌ర్వాత బెజోస్ మ‌రో సంచ‌ల‌న అంశంలో ప‌రిశోధ‌న‌ల‌కు గానూ పెట్టుబ‌డుల‌కు రెడీ అవ‌తున్నార‌ట‌. అదే యాంటీ ఏజింగ్.

మ‌నిషికి వ‌య‌సు మీద ప‌డ‌కుండా ఆప‌డం.. అనే ప్ర‌కృతి విరుద్ధ‌మైన అంశంపై ఇప్ప‌టికే కొన్ని పరిశోధ‌న‌లు జ‌రిగి ఉండ‌వ‌చ్చు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటిది ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఎవ్వ‌రూ చూప‌లేక‌పోయారు. అసాధ్యం అనుకుంటున్న ఈ ప్ర‌క్రియ మీద ఇప్పుడు బెజోస్ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

మ‌నిషికి వ‌య‌సు మీద ప‌డ‌కుండా, ఒక వ‌య‌సు వ‌చ్చాకా ఆ ధృఢ‌త్వంతోనే, ఆ ఆరోగ్యంతోనే అత‌డు శాశ్వ‌తంగా జీవించడ‌మే ఈ యాంటీ ఏజింగ్ ప‌రిశోధ‌న ల‌క్ష్యం కావొచ్చు. ఈ విష‌యంలో ఎవ‌రు ఏం ప‌రిశోధ‌నలు చేశారు, ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం సాధించార‌నేది ప్ర‌శ్న కాదు. అయితే ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల్లో ఒక‌రైన బెజోస్ ఆ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నార‌నేది ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశ‌మే.

వీరు పెట్టుబ‌డులు పెట్టారంటే.. అందులో ఏదో సాధించే ల‌క్ష్య‌మే ఉంటుంది. అంత‌రిక్ష ప‌ర్యాట‌కం అలాంటిదే. ఇన్నేళ్లూ అంత‌రిక్షంలోకి అడుగుపెట్ట‌డం అంటే.. అది కేవ‌లం స్పేస్ సైంటిస్ట్ ల‌కే అనే భావ‌న ఉండేది. అయితే కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగి, మీకు ఆస‌క్తి, డ‌బ్బు ఉంటే చాలంటున్నాయి. మంచిదో చెడ్డ‌దో మార్పును సాధించాయ‌వి. మ‌రి ఇప్పుడు బెజోస్ యాంటీ ఏజింగ్ మీద పెట్టుబ‌డులు పెడుతున్నాడ‌ట‌. ఇందులో కూడా దీర్ఘ కాలిక ల‌క్ష్యాలు ఉండ‌వ‌చ్చు.

వ‌య‌సు ప్ర‌భావం మీద‌ప‌డ‌కూడ‌ద‌ని కోరుకునే మ‌నుషులు బోలెడంత మంది. మ‌నిషి వ‌య‌సు ఆగిపోతే అది ఎలాంటి వినాశ‌నానికి దారితీస్తుంద‌నేది వేరే క‌థ‌. అయితే వ‌య‌సు ప‌రుగును ఆపేసేందుకు సీరియ‌స్ గా ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి ఒక ధ‌నికుడు పెట్టుబ‌డులు పెడుతున్నాడు. మ‌రి ముందు ముందు ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో!


Tags:    

Similar News