ఏపీ సర్కారు కీలక నిర్ణయం..స్కూళ్లు తెరిచినా వారికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండవట!

Update: 2020-08-08 15:00 GMT
కరోనా వేళ స్కూళ్లు తెరుస్తారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి ఆన్ లైన్ క్లాసులే అన్న మాట వినిపిస్తోంది. ఓపక్క కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళ.. స్కూళ్లు ఓపెన్ చేయటం సాధ్యమేనా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ప్రతి ఏడాదిలో విద్యా సంవత్సరం 222 రోజలు ఉంటే.. ఇప్పటికే 90 రోజులు విద్యార్థులు నష్టపోయారని.. అందుకే.. సిలబస్ ను కుదించే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ చెబుతున్నారు.

ఏడాది సిలబస్ ను ఆరు నెలల్లో పూర్తి చేయటమంటే అది విద్యార్థులకు.. టీచర్లకు కష్టమేనని చెప్పిన మంత్రి.. అందుకే సిలబస్ ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. అయితే.. సిలబస్ లో ఏయే అంశాల్ని తీసేస్తారన్న విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాదు..విద్యా సంవత్సరం చివర్లో నిర్వహించే వార్షిక పరీక్షా విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయనో కీలకమైన విషయాన్ని వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు వచ్చే ఏడాది ఎలాంటి వార్షిక పరీక్షలు ఉండవని తేల్చేశారు. కేవలం తొమ్మిది.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షల్నినిర్వహిస్తామని చెప్పారు. స్కూళ్లను తెరిచిన తర్వాత ఎలాంటి విధానాన్ని పాటించాలన్న అంశంపై ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Read more!

ప్రతి పదిహేను రోజులకో సారి విద్యార్థులకు హెల్త్ చెకప్ చేసి.. వారి హెల్త్ రికార్డుల్ని నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతి వారాంతంలోనూ నో బ్యాగ్ డే విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే స్కూలు ఆవరణలో నిర్వహించే అసెంబ్లీని ఇకపై ఎవరికి వారు వారి క్లాసుల్లో నిర్వహిస్తారని చెప్పారు. అయితే.. ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇప్పుడు అనుకుంటున్నట్లుగా స్కూళ్లు తెరవటం సాధ్యమేనా? అన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News