ఆ ‘హీరోయిన్’ కు టీఆర్ ఎస్ పై మనసైంది

Update: 2016-09-25 09:46 GMT
సొంతూరును వదిలి పెట్టి చాలా కాలమే అయ్యింది. ఎంతలా అంటే.. తనకు తాను మాది ఫలానా ఊరు తెలుసా? అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వేళ.. ఉన్నట్లుండి రాజకీయాలపై మనసైంది. సొంతూరు పేరు చెప్పి మరీ తెలంగాణ అధికారపక్షం తీర్థం పుచ్చుకోవాలన్న మనసులోని ఆశను.. ఆకాంక్షను చెప్పేశారు నాటి హీరోయిన్. అమ్మ పాత్రలు వేస్తూ.. అందరి మనసుల్ని దోచుకునే నాటి ముత్యాల ముగ్గు హీరోయిన్ సంగీతకు టీఆర్ ఎస్ పై మనసైంది. సినిమాలు.. సీరియల్స్ కారణంగా తెలుగు నేల వదిలిపెట్టి.. చెన్నైలో స్థిరపడిన ఆమె ఈ మధ్యనే సొంత ప్రాంతంపై మనసుపడి హైదరాబాద్ వచ్చేశారు. అంతేకాదు.. ఇప్పుడు తెలంగాణ అధికారపక్షంలో చేరిపోవాలని భావిస్తున్నారు.

అమ్మ పాత్రల్లో మెరిసే సంగీత తన గురించి చెప్పుకొస్తూ.. తమ సొంతూరు వరంగల్ అని.. బాపు.. విశ్వేశ్వర్ రావుల అశీర్వాదంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నట్లు చెప్పిన ఆమె.. తన మొదటి సినిమా తీర్పు అని.. అయితే.. ముత్యాలముగ్గు మొదట రిలీజ్ అయ్యిందన్న విషయాన్ని వెల్లడించారు. హీరోయిన్ గా తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె.. దక్షిణాది భాషల్లో మొత్తం 600లకు పైగా సినిమాల్లో నటించినట్లు చెప్పుకొచ్చారు.

తనను రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించారని.. కానీ తాను ఆసక్తి చూపించలేదని చెప్పారు. అలాంటి సంగీతకు ఇప్పుడు తెలంగాణలోని అధికారపక్షంలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న సంగీతకు ఉన్నట్లుండి రాజకీయాల మీద మనసవ్వటం ఏమిటో..?
Tags:    

Similar News