అమెరికాలో మరోసారి తుపాకుల మోత.. 9 మంది బలి!

Update: 2023-05-29 12:35 GMT
అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. ఇప్పటికే ఇలా ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో స్కూల్‌ పిల్లలు సహా పలువురు బలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమోరు అమెరికాలోని చికాగో నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. సామూహిక కాల్పులలో 9 మంది బలయ్యారు. 32 మంది గాయపడ్డారు. బాధితులంతా 14-69 ఏళ్ల మధ్య వయసువారే.

అమెరికాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన చికాగోలో వారాంతంలో మెమోరియల్‌ డే సందర్భంగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. చికాగో నగరమంతటా వేర్వేరు చోట్ల ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది బలయ్యారు. మొదటి కాల్పులు.. చికాగోలోని వెస్ట్‌ మన్రో రోడ్‌లోని 6300 బ్లాక్‌లో చోటు చేసుకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భీతిల్లారు.

కాగా గాయపడిన 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి తగిలిన గాయాల తీవ్రతను బట్టి వీరిలో కొంత మంది మరణించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా కేవలం కాల్పులు మాత్రమే కాకుండా మందుగుండు సామాగ్రిని విసరడం ద్వారా చంపారని అంటున్నారు.

అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున వెస్ట్‌ గార్ఫీల్డ్‌ పార్క్‌ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ వెస్ట్‌ టేలర్‌ స్ట్రీట్‌ లోని 4100-బ్లాక్‌లో తెల్లవారుజామున 2:09 గంటలకు పార్క్‌ చేసిన కారులో కూర్చుని ఉండగా, ఎవరో కాల్పులు జరిపారని చికాగో పోలీసులు తెలిపారు.

అలాగే నగరంలోని లేక్‌ వ్యూ పరిసరాల్లోని వెస్ట్‌ బారీ అవెన్యూలోని 600-బ్లాక్‌లోని కాలిబాటపై ముగ్గురు పురుషులు నడుచుకుంటూ వెళుతుండగా కాల్పులు జరిగినట్లు చికాగో పోలీసులు తెలిపారు.  

అదేవిధంగా వాషింగ్టన్‌ హైట్స్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. చికాగో పోలీసుల ప్రకారం.. వెస్ట్‌ 105వ స్ట్రీట్‌లోని 1000-బ్లాక్‌లో 20 ఏళ్ల వ్యక్తి వద్దకు ఇద్దరు వ్యక్తులు చేరుకున్నారు. వారిలో ఒకరు కాల్పులు జరపడంతో 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

ఇలా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు చికాగో నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో 9 మంది బలవ్వగా 32 మంది గాయపడ్డారు. గాయపడ్డవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ కాల్పుల ఘటనలపై అమెరికా పోలీసులు, డిటెక్టివ్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Similar News