ప్రస్తుతానికి ‘నాలుగో’ జెండా ఎగురుతోంది

Update: 2016-06-21 16:27 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుల్లో ఒకటైన భారీ జెండా నిర్వహణ వ్యవహారం అంత ఈజీ కాదన్న విషయం తేలిపోయింది. తాను అనుకున్నట్లే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఘనంగా ఎగురవేసినప్పటికీ.. దాన్ని కొనసాగించటం అంత తేలిక కాదన్న విషయం గడిచిన మూడు వారాల్లో (సుమారుగా) అర్థమైపోయిన పరిస్థితి. రికార్డు స్థాయిలో 291 అడుగుల ఎత్తున రెపరెపలాడేలా డిజైన్ చేసిన ఈ భారీ జెండా పెనుగాలులకు తరచూ చిరిగిపోతోంది.

జూన్ 2న ఘనంగా జెండాను ఎగుర వేసిన తర్వాత పెను గాలుల తాకిడికి మూడు జెండాలు ఇప్పటికి  చిరిగిపోయాయి. దీంతో.. కొద్దిరోజులు జెండా ఎగురవేయకుండా ఉంచి.. తాజాగా నాలుగో జెండాను ఎగురవేశారు. మొదటి జెండా రెండు రోజులకే చిరిగిపోగా.. రెండో జెండా కూడా మూడు రోజులకే చిరిగిపోయింది. మూడో జెండా ఒక వారం పాటు ఎగిరాక అది కూడా చిరిగిపోయింది. జెండా సిరిగి పోవటం ఒక ఎత్తు అయితే.. దీని ఖర్చు సైతం అధికారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఒక్కో జెండా ఖరీదు లక్షన్నర రూపాయిలుగా చెబుతున్నారు. ఖర్చు విషయాన్ని పక్కన పెడితే.. దీన్ని అడ్వాన్స్ గా తెప్పించుకొని పెట్టుకున్నా.. పదే పదే జెండా సిరిగిపోతే ఏం చేయాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అనుకోని విధంగా జెండా చిరిగిపోయి.. కొత్త జెండా మార్చే పరిస్థితి లేకపోవటం ఏదైనా సమస్య అవుతుందా? అన్నది అధికారులకు సందేహంగా మారింది.

దీనిపై  సలహా కోసం ఢిల్లీలోని ఫాగ్ ఫౌండేషన్ ఇండియా వారిని సంప్రదించి.. పరిస్థితిని వివరించారు. కొద్దిరోజులు జెండా ఎగురకపోయినా తప్పు లేదని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. హుటాహుటిన కొత్త జెండాల్ని ముంబయి నుంచి తెప్పించారు. ప్రస్తుతానికి నాలుగో జెండా ఎగురుతున్నప్పటికి ఇదెంత కాలం ఎగురుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. భారీ జెండా వ్యవహారం చూసిన తర్వాత పలువురికి అనిపిస్తున్నదేమంటే.. కేసీఆర్ కలను సాకారం చేయటం అంత తేలిక కాదని.
Tags:    

Similar News