జగన్ డిమాండ్లు....అరణ్య రోదనేనా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం ఒక్క రోజే వరుసగా మీడియా సమావేశాలు పెట్టారు.

Update: 2026-10-18 19:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదివారం ఒక్క రోజే వరుసగా మీడియా సమావేశాలు పెట్టారు. ఒక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠాను కలిశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని నామినేషన్లను దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. కనీసం నామినేషన్లు కూడా వేయనీయని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఆయన వివరించారు. ఆయనకు పార్టీ తరఫున రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వినతిపత్రం అంద చేశారు. ఈ సందర్భంగా మీడియాతో జగన్ మాట్లాడిన మాటలు చేసిన డిమాండ్లు వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో నామినేషన్లు :

నామినేషన్లను ఆఫీసులకు వెళ్ళి నేరుగా దాఖలు చేయకుండా అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దాఖలు చేసే విధానం రావాలని జగన్ కోరుతున్నారు. స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులను ప్రత్యర్థులు భౌతికంగా అడ్డుకుంటున్నారని కాబట్టి ఆన్‌లైన్ విధానాన్ని లేదా అమరావతిలోని ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృత నామినేషన్ల కేంద్రాన్ని తీసుకురావాలని జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసినపుడు డిమాండ్ చేశారు. అయితే ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే విధానం సాంకేతికంగానూ చట్టబద్ధంగానూ పూర్తిగా సాధ్యమయ్యే పనే అని అంటున్నారు.

ఇప్పటికే అందుబాటులో ఉంది :

అయితే ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరించే విధానం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం సువిధ పోర్టల్ ఎన్‌కోర్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్ నామినేషన్ల సదుపాయాన్ని కల్పిస్తోంది. అభ్యర్థులు తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అఫిడవిట్లను అప్‌లోడ్ చేసి సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించే సాంకేతికత ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపినప్పటికీ చివరలో రిటర్నింగ్ అధికారి ముందు ఆయా అభ్యర్థులు భౌతికంగా హాజరై సంతకం చేయడం లేదా స్క్రూటినీకి వెళ్లడం వంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే దానిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో అమలు చేయడం అంటే కొన్ని సవాళ్లు ఉన్నాయని అంటున్నారు.

సవరణలు చేయాలి :

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్ర పంచాయతీ రాజ్ లేదా మున్సిపల్ చట్టాల ప్రకారం నిబంధనలను సవరించి పూర్తి స్థాయి డిజిటల్ లేదా కేంద్రీకృత ఆమోద విధానాన్ని ప్రవేశపెట్టే అధికారం ప్రభుత్వాలకు, కమిషన్‌కు ఉంటుంది. ఈ విధంగా చేయడం అంటే ఎన్నికల్లో పారదర్శకత పెంచడానికి మరియు అభ్యర్థులపై దాడులు అడ్డంకులను నివారించడానికి ఆన్‌లైన్ నామినేషన్ల విధానాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడం అనేది ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఖచ్చితంగా సాధ్యమయ్యే ప్రక్రియే. కానీ అది అమలు చేయాలంటే ఏకాభిప్రాయం రావాలని అంటున్నారు. అయినా సరే చివరిలో అభ్యర్థులు ఎటూ భౌతికంగా కలవాల్సి ఉంటుంది. మరి అపుడు అయినా ఈ దాడులు జరిగే పరిస్థితి ఉంటుంది కదా అన్న చర్చ సాగుతోంది. అందువల్ల లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండడమే దీనికి అసలైన మార్గం అని అంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద :

ఇక జగన్ మరో డిమాండ్ పెట్టారు. అదే రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దనే అభ్యర్ధులు నామినేషన్లను స్వీకరించడం. అలా కేంద్రీకృత విధానాన్ని అమలు చేయాలని అన్నారు. అయితే వందలాది స్థానాలు వేలాదిమంది అభ్యర్ధులు అందరికీ ఒకే చోట నామినేషన్లు స్వీకరించడం అంటే అయ్యే పనేనా అన్నది మరో చర్చగా ఉంది. అక్కడ కూడా పెద్ద రద్దీ ఏర్పడుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అంటున్నారు.

కేంద్ర బలగాలతో :

ఇక కేంద్ర బలగాలను పారా మిలటరీ దళాలను తీసుకుని వచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని జగన్ కోరారు. అయితే ఈ విషయం మీద వైసీపీ కోర్టుకు వెళ్తే కొట్టేశారు. స్థానిక పోలీసులే లా అండ్ ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఆదెశించారు. అయినా దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతీ చోటా కేంద్ర బలగాలను తీసుకుని రావడం అంటే అయ్యే పనేనా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరీ దారుణంగా ఉండే చోట మాత్రమే ఈ డిమాండ్ సాధ్యపడుతుంది కానీ ఏపీ లాంటి చోట కాదని అంటున్నారు.

సుప్రీంకోర్టుకు సైతం :

ఇవన్నీ పక్కన పెడితే ఇపుడే ఇలా ఉంది, ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నీల సంగతి ఏమిటి అని కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్లే ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఆము ఏపీలో సజావుగా ఎన్నికలు జరిగేలా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. మరి సుప్రీం కోర్టులో ఏ విధంగా వైసీపీ పిటిషన్ వేస్తుంది దాని మీద ఏ రకంగా ప్రతిస్పందన ఉంటుంది అన్నది ఆలోచించాల్సిందే.

Tags:    

Similar News