దసరా సంబరాలు ఏమయ్యాయి బ్రో.. సర్వే ఏం చెప్పింది?
మరి కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ రానుంది. అయితే.. గతంలో ఉన్న సరదా.. సంబరా లు మాత్రం ఇప్పుడుఎక్కడా కనిపించడం లేదు.
మరి కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగ రానుంది. అయితే.. గతంలో ఉన్న సరదా.. సంబరా లు మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్లు కూడా బోసి పోతున్నాయి. ప్రజలు సైతం.. పెద్దగా ఇంట్రస్టు చూపించడం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి అసలు దసరా సరదా ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. ఏపీలో స్థానిక సంస్థల ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. సరిగ్గా పండుగ సీజన్ ప్రారంభం అయ్యే సమయంలోనే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రజల దృష్టి ఎన్నికలపైనే పడింది.
జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వాస్తవానికి దసరా పండుగ పదిరోజుల పాటు జిల్లాల్లో వివిధ ఆటలు, పండుగ పిండి వంటలు వంటివి కనిపించేవి. కానీ, ఈ సారి ధరా భారం కారణంగా.. ప్రజలు తయారు చేసుకునేందుకు మొగ్గు చూపడంలేదు. నూనెల నుంచి పప్పుల వరకు కూడా ధరలు పెరిగిపోయాయి. దీంతో ఏదో మొక్కుబడిగానే ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కారణంగా గ్రామాల్లో వర్గ పోరు పెరిగిపోయింది. దీంతో స్థానికంగా జరిగే కార్యక్రమాలు కూడా చేయడం లేదు. పట్టుమని పది మంది కూడా దసరాపై దృష్టి పెట్టలేదంటే ఆశ్చర్యం వేయకమానదు.
ఇక, తెలంగాణలో దసరా సందర్భంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నా.. కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. ఎల్ నినో కారణంగా కరువు నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, పనులు లేక కార్మికులు వలసలు పోతున్నారు. అదేసయమంలో ధరల ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి కొన్ని పట్టణ ప్రాంతాల్లో తప్ప.. పెద్దగా సందడి కనిపించకుండా పోయింది. ప్రభుత్వం కూడా దసరా సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో తెలంగాణలోనూ దసరా సహా బతుకమ్మ పండుగలు మొక్కుబడిగానే సాగుతున్నాయని చెప్పాలి.
దేశంలో..
ఇక, దేశవ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే.. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపైనే ఎక్కువగా ఫొకస్ పెట్టారు. అదే సమయంలో సర్ జరుగుతున్న రాష్ట్రాల్లోనూ దసరా ఉత్సాహం లేకుండా పోయింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా కూడా ధరలు మండుతున్నాయి. అదే సమయంలో ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు కారణంగా.. స్టాక్ మార్కెట్ ప్రభావానికి గురైంది. ఈ ఫలితంగా దసరా పెద్దగా జరుపుకొనే పరిస్థితి కనిపించడం లేకుండా పోయిందన్నది ప్రజలు చెబుతున్న మాట. తాజాగా అసోచాం సంస్థ నిర్వహించిన సర్వేలో దసరా కేవలం ప్రకటనలకు, సెలవులకు మాత్రమే పరిమితం అయిందని.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోందని తేలింది. మొత్తంగా ఈ దసరా పెద్దగా సంబరాలు లేకుండానే సాగిపోతుండడం గమనార్హం.