జగన్ కేబినెట్ లో అంబటి హోంమంత్రి !
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అని అంటారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు.
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అని అంటారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికలు మాదిరిగా హీట్ అయితే ఉంది. కానీ ఆ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళకు పైగా సమయం ఉంది. కానీ 2929లో జగన్ ప్రభుత్వం అందులో తొలి మంత్రి కూడా ఫిక్స్ అయిపోయారు. అందులో కూడా కీలకమైన హోం శాఖా మంత్రి. ఆ శాఖను తీసుకున్నది ఎవరో కాదు, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. వచ్చేది జగన్ ప్రభుత్వం, తాను హోం మంత్రి అవుతాను అని పోలీసుల ముందే అంబటి చెప్పి సంచలనం రేపారు. ఇక తాను తొలి ఆరు నెలలు మాత్రమే హోం మంత్రిగా ఉంటాను అని కాల పరిమితి కూడా పెట్టుకున్నారు.
ఆసక్తికరంగానే :
గుంటూరు కార్పోరేషన్ మేయర్ అభ్యర్ధి వైసీపీ తరఫున నామిమేషన్లు దాఖలు చేస్తున్న సందర్భంగా ఆ జిల్లా అధ్యక్షుడిగా అంబటి వైసీపీ కార్యకర్తలు అందరితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన సరదా సంభాషణ చేశారు. మరో వైపు తమ పార్టీ వారికి కూడా హుషారు తెచ్చే ప్రయత్నం చేశారు. సహజంగానే అంబటి అంటేనే సెటైర్లు కామెంట్స్ అన్నది అందరికీ తెలిసిందే. నామినేషన్ల సందర్భంగా కూడా ఆయన అదే తీరున వ్యవహరించారు. ఇదే సందర్భంలో ఆగండయ్యా వచ్చేది మన ప్రభుత్వం నేనే మన ప్రభుత్వంలో హోం మంత్రిని అని పార్టీ నేతలకు చెబుతూనే పోలీసులకు కూడా సందేశం ఇచ్చారు.
హోం మంత్రి పదవి మీద :
అంబటిది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన 2022 వరకూ మంత్రి కాలేకపోయారు. జగన్ ప్రభజనంలో ఆయన సత్తెనపల్లిలో గెలిచి జగన్ మంత్రి మండలి విస్తరణలో రెండవ విడతల జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆయన 2029 లో తొలి విడతలోనే హోం మంత్రిగా బాధ్యతలు తీసుకుంటాను అని అంటున్నారు. దీంతో ఆయనకు ఈ పదవి మీద మోజు ఉందని భావిస్తున్నారు. గత కూటమి ప్రభుత్వంలో కూడా అనేక మంది హోం మంత్రిత్వ శాఖ మీద మోజు పెంచుకున్న వారే. కానీ అనూహ్యంగా అనితను ఆ పదవి వరించింది అని గుర్తు చేస్తున్నారు. అయితే తరచూ ఈ శాఖ గురించి ఎందుకు మాట్లాడుతారు అంటే పోలీసులు తమని వేధిస్తున్నారు అని విపక్షం ఎపుడూ ఆరోపణలు చేస్తుంది. దాంతో పోలీసులకు గట్టిగా చెప్పేందుకు నేనే హోం మంత్రిని అవుతాను అని నాయకులు అంతా చెబుతూ ఉంటారు అని అంటున్నారు. అంబటి వ్యాఖ్యలను అలా తీసుకోవాలా లేక సీరియస్ గా భావించాలా అన్నది అయితే ఆలోచించాల్సిందే మరి.
పోలీసులు మంచివారే :
ఇదిలా ఉంటే ఎపుడూ పోలీసుల మీద గట్టిగా విరుచుకుపడే అంబటి తాజాగా మాత్రం వారితో సరదాగానే మాట్లాడారు. పోలీసులు అందరూ మంచివారే ఒక్కరు తప్ప అని అంబటి అంటూ అక్కడా నవ్వులు పూయించారు. అంతే కాదు పోలీసులు వద్దు అని చెబుతున్నారంటే ఎందుకు వెళ్ళడం అని తన పార్టీ వారిని గదమాయించారు. వారు ప్రమాదం ఏదో ఉంటుందనే కదా వద్దు అంటున్నారు. వెళ్లకుండా ఉంటే ఏమి పోయింది అన్ వైసీపీ నాయకులకు సూచిస్తూ పోలీసులకు వారి ఆదేశాలకు మద్దతు ఇచ్చారు. అంతే కాదు పోలీసులు మనకు కాఫీలు టిఫిన్లు అరెంజ్ చేస్తారు అని సరదా వ్యాఖ్యలూ చేశారు. మొత్తానికి అంబటి చేసిన ఈ కామెంట్స్ అన్నీ అటు పోలీసులను ఇటు పార్టీ నేతలను ఉత్సాహపరచాయి. అంతా అంబటి కామెంట్స్ కి సరదాగా నవ్వుకోవడం కనిపించింది.