ఏపీ లోక‌ల్ పోరు... ఇంటా - బ‌య‌టా.. ఫైటింగులే.. !

ఈ ప‌రిణామాలు ఇప్ప‌టి వ‌ర‌కు సీమ‌కే పరిమితం అయ్యాయి. అయితే.. ఇత‌ర ప్రాంతాల్లో దీనికి భిన్న‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Update: 2026-10-19 03:42 GMT

స్థానిక ఎన్నిక‌ల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. అంతా స‌వ్యంగా సాగుతుంద‌ని.. ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా మారుతాయ‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. ఆవిధంగా అయితే.. జ‌ర‌గ‌డం లేదు. ఇంటా బ‌య‌టా కూడా.. రాజ‌కీయాలు వేడి వేడిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో అన్ని పార్టీల‌కూ.. ఈ ప‌రిణామం త‌ల‌నొప్పిగా మారింది. ఒక‌వైపు.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ద్య యుద్ధం తీవ్ర‌స్థాయిలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. సీమ ప్రాంతంలో నామినే ష‌న్ వేయ‌డం అంటే.. యుద్ధం చేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాలు ఇప్ప‌టి వ‌ర‌కు సీమ‌కే పరిమితం అయ్యాయి. అయితే.. ఇత‌ర ప్రాంతాల్లో దీనికి భిన్న‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన ఇలా.. అన్ని పార్టీల్లోనూ నాయ‌కుల తిరుగుబాటు, రెబ‌ల్స్‌, నామినే ష‌న్ల ప‌ర్వం, అసంతృప్తులు.. అల‌క‌లు ఇలా అన్ని కోణాల్లోనూ పార్టీలు ఇరుకున‌ప‌డ్డాయి. టికెట్ ద‌క్కిన వారు ఒక విధంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే.. ద‌క్క‌ని వారు రెబ‌ల్స్‌గా మారుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీలు మారుతున్న వారు కూడా రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి హాట్ హాట్‌గా మారింది.

ఒకే ఇంట్లో.. ఇద్ద‌రు నాయ‌కులు వేర్వేరు పార్టీల త‌ర‌ఫున కూడా పోటీ చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి టీడీపీ కూట‌మి త‌ర‌ఫున న‌ర్సీప‌ట్నం చైర్మ‌న్ రేసులోకి దిగారు. ఈమెకు పోటీగా అయ్య‌న్న సోద‌రుడు స‌న్యాసి పాత్రుడు స‌తీమ‌ణి వైసీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేశారు. పులివెందుల‌లోనూ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు వేర్వేరుగా త‌ల‌ప‌డుతున్నార‌ని తెలిసింది. అలానే.. ఉత్త‌రాంధ్ర‌లోనూ ఒకే కుటుంబానికి చెందిన వారు ఎన్నిక‌ల్లో సై అంటున్నారు.

ఇక‌, పార్టీల ప‌రంగా చూసుకుంటే త‌మ‌కు టికెట్‌రాలేద‌ని వ‌గ‌స్తున్న వారు.. సొంత‌గానే పోటీ చేస్తున్నారు. ఇది.. టికెట్ ద‌క్కించుకున్న వారిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేయాల్సిన స‌మ‌యంలో ఇలా ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిల‌వ‌డం ప‌ట్ల వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇక‌, పార్టీల్లోనూ ఈ వ్య‌వ‌హారం ఇబ్బందిగా మారింది. సాలూరు ప‌రిస్థితే దీనికి ఉదాహ‌ర‌ణ‌. అలానే ద‌ర్శిలోనూ.. ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. వైసీపీలోనూ చివ‌రి నిమిషంలో పోటీ నుంచి త‌ప్పుకొంటున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అన్ని పార్టీలు కూడా ఇంటా బ‌య‌టా వేడెక్కిన రాజ‌కీయంగా స‌త‌మ‌తం అవుతున్నాయి.

Tags:    

Similar News