అమరావతి ప్రాంతంలో పెరిగిపోతున్న ఉద్రిక్తతలు

Update: 2020-10-23 03:30 GMT
అమరావతి కేంద్రంగా అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఇవి ఎటు దారితీస్తాయో తెలీటం లేదు. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ దాదాపు 300 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో అప్పుడప్పుడు మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే గడచిన కొద్ది రోజులుగా మూడు రాజధానులకు అనుకూల ఉద్యమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో అమరావతి ప్రాంతం ఉద్రిక్తతంగా మారుతోంది.

అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఆందోళన ప్రారంభంలో ఉన్నంత గట్టిగా ఇపుడు లేవనే చెప్పాలి. మొదట్లో అంటే చంద్రబాబునాయుడుతో సహా   యావత్ టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లోనే మోహరించే వారు కాబట్టి అప్పట్లో మంచి ఊపు కనిపించింది. అయితే అప్పట్లో జరిగిన ఆందోళనంతా పెయిడ్ ఉద్యమాలే అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడులు చేశారు. ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే రాజధాని కోసం 29 గ్రామాల్లోని ప్రజలు భూములిస్తే ఉద్యమం మాత్రం కేవలం ఏడెనిమిది గ్రామాల్లోని ఎక్కువగా కనిపించింది. ఇదే సమయంలో ఆయా గ్రామాల్లోని జనాలకన్నా ఇతర ప్రాంతాలకు చెందిన  టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల తాలూకు మనుషులే ఎక్కువగా కనిపించేవారు. దాంతో ఇది పెయిడ్ ఉద్యమమని ఆరోపణలు చేయటానికి వైసీపీ నేతలకు అవకాశం దొరికింది.

సరే ఈ ఆందోళనలు ఇలా కంటిన్యు అవుతుండగానే బహుజనుల ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా అంటూ మరికొందరు  పోటీ ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబునాయుడు, భువనేశ్వరి తదితరులు ఉద్యమ విరాళాలంటూ హడావుడి చేశారు.  విరాళాల కోసం చంద్రబాబు కొన్ని ప్రాంతాల్లో తిరిగారు.  ఒకవైపు అమరావతి కోపం చంద్రబాబు పర్యటిస్తుండగానే మరోవైపు మూడు రాజధానుల కోసమంటూ దళిత బహుజనులు మొదలుపెట్టిన ఆందోళనలు కూడా ఊపందుకుంది. దాంతో ఒకవైపు అమరావతికి అనుకూలంగా  మరోవైపు  మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి.

ఈ ఆందోళనలు జరుగుతుండగానే హఠాత్తుగా కరోనా వైరస్ సమస్య మొదలవ్వటంతో రెండు వైపుల ఉద్యమాలు నీరసించిపోయాయి. దళితబహుజనుల పేరుతో మొదలైన ఆందోళనలను విరమించుకున్నారు. అయితే అమరావతికి అనుకూలంగా మొదలైన ఆందోళనలను స్ధానికులు తమ ఇళ్ళకే పరిమితం చేశారు. అయితే కరోనా వైరస్ సమస్య తగ్గుతోందన్న కారణంగా మళ్ళీ అనుకూల ఆందోళనలు ఊపందుకుంది.

అయితే ఇదే సమయంలో దళిత బహుజనుల ఆధ్వర్యంలో మళ్ళీ మూడు రాజధానులకు మద్దతుగా టెంట్లు ఏర్పాటయ్యాయి. మూడు రాజధానులకు అనుకూలంగా, అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళ స్ధలాలు పంపిణీ చేయాలని డిమాండ్లతో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. మొత్తానికి రెండు డిమాండ్లతో జరుగుతున్న ఆందోళనలు చివరకు ఎటువైపు దారితీస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతోంది.
Tags:    

Similar News