మోడీ భ‌ద్ర‌త‌కు 3000 మంది.. ఒక రోజుకు ఖ‌ర్చు కోటిన్న‌ర పైమాటే!

Update: 2022-01-07 15:30 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భ‌ద్ర‌త‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. రెండు రోజుల కింద‌ట పంజాబ్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు ఎదురైన ఇబ్బందులు.. ఆయ‌న ఏకంగా.. వెన‌క్కి వెళ్లిపోవ‌డం.. 20 నిముషాల పాటు రోడ్డుపైనే ఉండిపోవ‌డం.. ఇలాంటి అంశాల నేప‌థ్యంలో ఇప్పుడు.. అస‌లు ప్ర‌ధాని  మోడీ భ‌ద్ర‌త ఎలా ఉంటుంది? ఎంత మంది ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తారు?  దీనికి ఎంత ఖ‌ర్చు అవుతుంది?  అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

రోజుకు కోటిన్న‌ర పైమాటే ఖ‌ర్చు!
ప్రధాని భద్రతకు 3000 మంది మెరిక‌ల్లాంటి 30-35 ఏళ్ల  వ‌య‌సున్న‌ ఎస్పీజీ అధికారులను నియ‌మిస్తారు. సగటున రోజుకు వీరికి రూ.1.6 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఎస్పీజీలో నియామకాలు కొనసాగుతూనే ఉంటాయి. వీరికి అత్యంత కఠినమైన దేహదారుఢ్య శిక్షణ, ఖ‌చ్చితమైన గురితో కాల్చడం, వెన్నుపోటు దాడులను ఎదుర్కొనేలా కమ్యూనికేషన్లు వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో నిత్యం కొత్త అంశాలు వచ్చి చేరతాయి.

ఎలాంటి వాతావ‌ర‌ణంలో అయినా..
ఎస్పీజీలో ఉండే అధికారులు ఎలాంటి వాతావ‌ర‌ణంలో అయినా ప‌నిచేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే వారికి దుస్తులు ఇస్తారు. సాధారణంగా శీతాకాలంలో బిజినెస్‌ సూట్స్‌, కళ్లజోడు ధరించి ప్రధాని చుట్టూ ఉంటారు. టూవే ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్లు అందించే ఇయార్‌ పీస్‌లు, గ్లోక్‌-17 హ్యాండ్‌ గన్స్ వాడతారు. వేసవి సఫారీ సూట్స్‌ ధరిస్తారు. అత్యాధునిక ఎఫ్‌ఎన్‌-హెర్‌స్టాల్‌ పీ 90 సబ్‌మిషిన్‌ గన్లు, ఫోల్డబుల్‌ బాలిస్టిక్‌ షీల్డ్‌  ప్రధాని పక్కన కనిపించే సూట్‌కేసులు వంటివి) వాడతారు.

బ్లూ బుక్ ఆధారంగా..
ప్రధాని, ఆయన నివాసం, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం వీరి విధి. ఆయన రక్షణకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన 'బ్లూబుక్‌'లోని అంశాలను కచ్చితంగా అనుసరిస్తుంది. ప్రధాన మంత్రికి సంబంధించిన ప్రతి పర్యటనపై ఎస్పీజీ క్షుణ్ణం గా అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలో బ్లూబుక్‌లో నిబంధనల ప్రకారం కేంద్ర ఏజెన్సీలు, ఆయా రాష్ట్రాల పోలీసులను సమన్వ యం చేసుకొంటుంది.

మూడు రోజుల ముందు నుంచే
ముందుగా నిర్ణయించిన పర్యటనకు మూడు రోజుల ముందు ఎస్పీజీ అధికారులు, ఆయా రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, జిల్లా కలెక్టర్‌తో ఏఎస్‌ఎల్‌ (అడ్వాన్స్డ్‌ సెక్యూరిటీ లిఏజాన్‌) డ్రిల్‌ నిర్వహించి లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. ప్రధాని పర్యటనలో ప్రతినిమిషం భద్రతా వలయాన్ని కొనసాగించే విషయంపై ఏర్పాట్లను చర్చిస్తారు. ఒక్కసారి ఏఎస్‌ఎల్‌ మీటింగ్‌ ముగిశాక దానిలో పాల్గొన్న అధికారులు కచ్చితంగా నివేదికపై సంతకాలు చేస్తారు.

అన్ని మార్గాలూ కీల‌క‌మే!
ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రయాణించాల్సిన వాయు, రోడ్డు, రైలు మార్గాల ఎంపికకు కేంద్ర, స్థానిక ఇంటెలిజెన్స్‌ సమాచారా న్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఒక్కసారి ఆ ప్రదేశానికి చేరుకొన్నాక వేదికపైకి ప్రధాని చేరుకొనేందుకు అవసరమైన మార్గాల ను సిద్ధం చేయడంపై దృష్టిపెడతారు. సాధారణంగా హెలికాఫ్టర్‌, లేదా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్లోని ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు, వేదిక భద్రతను అంచనా వేస్తారు.

ఇందిర‌మ్మ హ‌త్య త‌ర్వాత‌..
ప్రధాని భద్రతను మాత్రం 3000 మంది మెరికల్లాంటి సిబ్బందితో కూడిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) చూసుకుంటుంది. వాస్తవానికి 1984లో ఇందిరా గాంధీ హత్యకు ముందు వరకు ప్రధాని నివాస భద్రత వంటివి ఢిల్లీ పోలీస్‌లోని డీసీపీ స్థాయి అధికారి అధ్వర్యంలో స్పెషల్‌ సెక్యూరిటీ డిస్ట్రిక్ట్‌ చూసుకొనేది. 1981 నుంచి ప్రధాని ప్రయాణ భద్రత,రోడ్డు సెక్యూరిటీలను చూసుకొనేందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ, 1984లో ఇద్దరు డిల్లీ పోలీసులు నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రధాని భద్రతకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీలు సూచించాయి. దీంతో 1985 ఏప్రిల్‌లో 819 మందితో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దళంలో 3,000 మంది సిబ్బంది ఉన్నారు.
Tags:    

Similar News