వైసీపీని భ‌య‌పెడుతున్న 2022.. సీనియ‌ర్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

Update: 2022-01-06 01:30 GMT
2022వ సంవ‌త్స‌రం అన్ని వ‌ర్గాల్లో ఆశ‌లు నింపుతుండ‌గా.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాత్రం గుబులు రేపుతోంది. 2021లో పెరిగిన వ్య‌తిరేక‌త‌.. అలానే సాగితే.. కొత్త ఏడాదిలో మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌ద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే 2021లో రాష్ట్రంలోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక‌ర‌ణ‌లు మారాయి. రాజ‌కీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల్లో మార్పు క‌నిపిస్తోంది. ఇదేదో.. పైకి చెబుతున్న మాట ఏమాత్రం కాదు . ప్ర‌భుత్వం అత్యంత గోప్యంగా రెండు మార్గాల్లో సేక‌రించిన స‌ర్వే ఫ‌లితాలే చాటి చెబుతున్నాయ‌ని వైసీపీ నాయ‌కుల మ‌ధ్యే గుసగుస వినిపిస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటిపోయింది. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసింది. అనేక సంచ‌ల‌న ప‌థ‌కాలు కూడా తీసుకువ‌చ్చింది. అంతేకాదు.. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. స్థానిక సంస్థ‌ల నుంచి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల వ‌ర‌కు అనేక రూపాల్లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం పెంచింది. కీల‌క‌మైన ప‌ద‌వులు కూడా అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ రెండున్న‌రేళ్ల పాల‌న‌పై.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క వైఖ‌రిపై.. జ‌నం నాడి ఎలా ఉంద‌నే విష‌యంపై వలంటీర్లు స‌హా ఇంటిలిజెన్స్ వ‌ర్గాల నుంచి స‌ర్వే చేయించుకున్న‌ట్టు వైసీపీలో టాక్ న‌డుస్తోంది. ఈ స‌ర్వేలో భిన్న‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు.

వ‌లంటీర్లు తీసుకువ‌చ్చిన స‌ర్వే ఫ‌లితాల్లో జ‌గ‌న్ పాల‌న‌పై మిశ్ర‌మ ఫ‌లితం క‌నిపించిందని ప్ర‌చారం జ‌రుగుతోంది! అంటే.. ప్ర‌జ‌ల్లో కొంద‌రు జ‌గ‌న్ పాల‌న ఎలా ఉన్నా.. త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అందుతున్నాయి కాబ‌ట్టి.. భేష్ అంటున్న‌ట్టు వ‌లంటీర్లు చేసిన స‌ర్వేలో స్ప‌ష్టం అయిందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు స్థిరంగా నే ఉంద‌ని.. మ‌హిళ‌లు, వృద్ధులు జ‌గ‌న్ వైపే ఉన్నార‌ని వ‌లంటీర్లు చేసిన స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ని వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. అయితే.. మ‌ధ్య త‌ర‌గతి స‌హా ఉన్నత స్థాయి వ‌ర్గాల్లో మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై త‌ట‌స్థ వైఖ‌రి ఉంద‌ని.. తెలిసిందని స‌మాచారం.

ఇక‌, ఇంటిలిజెన్స్ స‌ర్వేలో.. మాత్రం జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని తెలిసింద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న విష‌యం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి ప‌టిష్ట‌మైన కార‌ణాలుగా పెట్రోలు ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెర‌గ‌డంతోపాటు.. రాష్ట్రాన్ని అప్ప‌ల పాలు చేస్తున్నార‌నే ఆవేద‌న ఈ వ‌ర్గాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని స‌ర్వేలో వెల్ల‌డైన‌ట్టు.. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయ‌ని స‌మాచారం. అయితే.. పెట్రోల్ ధ‌ర‌ల‌ను కొంత మేర‌కు త‌గ్గిస్తే.. ఈ అసంతృప్తి త‌గ్గుతుంద‌ని.. అదేవిధంగా మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గం స‌హా ర‌వాణా రంగం ర‌హ‌దారుల విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్న‌ట్టు తెలిసింద‌ని చెబుతున్నారు.

అంటే.. మొత్తానికి ఈ రెండేళ్ల కాలంలో ప్ర‌భుత్వంపై భారీ వ్య‌తిరేక‌త లేక‌పోయినా.. జాగ్ర‌త్త ప‌డ‌డం మంచిద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని నాయ‌కులు గుస‌గుస లాడుతున్నారు. ముఖ్యంగా 2022లో అయినా.. వ్య‌తిరేక‌త త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాల‌నేది నేత‌ల సూచ‌నగా ఉంద‌ని తెలిసింది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News