నక్సల్స్ వ్యూహాత్మక దెబ్బ... 17 మంది జవాన్లు మృత్యువాత

Update: 2020-03-22 11:58 GMT
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ అటవీ ప్రాంతం మరోమారు కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. జావాన్ల రక్తంతో మరోమారు తడిసిపోయింది. మావోయిస్టులు వ్యూహాత్మకంగా విసిరిన పంజాతొో భద్రతా దళాలకు చెందిన 17 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. తమపై ఎటాక్ చేసేందుకు వచ్చిన భద్రతా దళాలను ముందుగానే గుర్తించిన మావోయిస్టులు... వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినట్టే వేసి కౌంటర్ ఎటాక్ చేశారు. ఫలితంగా భద్రతా దళాలు తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతేకాకుండా భద్రతా దళాలపై తమదైన శైలి దాడులు చేసిన మావోయిస్టులు బలగాలు తేరుకునేలోపే... బలగాల ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు కాల్పుల్లో గాయపడ్డ సహచరులతో సహా మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు.

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లి పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ వందలాది మంది మావోయిస్టులు సమావేశమయ్యారన్న వార్తల నేపథ్యంలో సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా దళాలకు చెందిన 600 మంది భారీ పటాలంతో భద్రతా దళాలు మావోయిస్టులపై అటాక్ చేసేందుకు ప్లాన్ వేశాయి. ఈ క్రమంలో భారీ మందుగుండు సామాగ్రితో భద్రతా దళాలు బయలుదేరాయి. ఈ ఆపరేషన్ లో బాగంగా మింపా గ్రామ సమీపానికి చేరే సమయానికే... అప్పటికే భద్రతా దళాల ఉనికిని గ్రహించిన మావోయిస్టులు వ్యూహాత్మకంగా కౌంటర్ ఎటాక్ కు సిద్ధపడిపోయారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. దాదాపుగా 2.30 గంటల సేపు జరిగిన కాల్పులు సద్దుమణిగిన వెంటనే... తమలోని 14 మంది జవాన్లు గాయపడ్దారని, మరో 13 మంది జవాన్ల జాడ కనిపించడం లేదని భద్రతా దళాలు తెలిపాయి. ఆచూకీ తెలియని వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం విగతజీవులుగా పడి ఉన్న 17 మంది జవాన్లను భద్రతా దళాలు గుర్తించాయి. అంతేకాకుండా ఈ ఘటనలో భద్రతా దళాలకు భారీ దెబ్బ కొట్టిన మావోయిస్టులు... భద్రతాదళాలకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా ఎత్తుకెళ్లాయట.
Tags:    

Similar News