ఏటీఎం ల్యాబ్.. 130 రకాల పరీక్షలకు ఒక్కటే యంత్రం.. వింటేనే వింత.. !

ఏటీఎం అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది కేవలం డబ్బులు తీసుకునేది మాత్రమే. కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని వస్తువులు తీసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తుంటారు.;

Update: 2026-04-07 06:09 GMT

ఏటీఎం అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది కేవలం డబ్బులు తీసుకునేది మాత్రమే. కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని వస్తువులు తీసుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఏటీఎంలు రాక ముందు బ్యాంకుల వద్దకు వెళ్లాలంటేనే భయం అయ్యేది. ఇవి వచ్చిన తర్వాత చాలా వరకు వెసులు బాటు కలిగింది. ఇప్పుడు యూపీఐ మరింత వెసులు బాటు కలుగుతుందనుకోండి. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎంలు తెచ్చిన విప్లవం గురించి మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు వైద్య రంగంలో కూడా ‘హెల్త్ ఏటీఎం’ల (Health ATMs) రూపంలో అటువంటి మార్పే రాబోతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, రక్తం, ఇతర 130 రకాల పరీక్షలను నిమిషాల్లో పూర్తి చేసే ఈ సాంకేతికతను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఆగస్టు, 2025లో కింగ్ కోటి, మలక్ పేట్ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, పేద ప్రజలకు ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలను చేరువ చేయడంలో ఇది ఒక మైలురాయిగా నిలవబోతోంది.

ఖచ్చితత్వంతో కూడిన సేవలు

హెల్త్ ఏటీఎంల ప్రధాన ఉద్దేశ్యం రోగుల రద్దీని తగ్గించడం, డాక్టర్లను కలిసే ముందే ప్రాథమిక స్క్రీనింగ్‌ను పూర్తి చేయడం. ఒక్కో ఏటీఎం ద్వారా 65 రకాల నాన్-ఇన్వాసివ్ (రక్తం అవసరం లేనివి) 20 రకాల బ్లడ్ బేస్డ్ పరీక్షలతో సహా మొత్తం 130 పరీక్షలను నిర్వహించవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏటీఎంల నివేదికలను ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ల ఫలితాలతో సరిపోల్చి చూడగా, అవి అత్యంత ఖచ్చితంగా ఉన్నట్లు తేలింది. ఈ నివేదికలు నేరుగా ‘క్లౌడ్’ ద్వారా రోగుల డిజిటల్ హెల్త్ రికార్డులకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల కాగితాల అవసరం లేకుండానే డాక్టర్లు రోగి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించవచ్చు.

సాంకేతిక సవాళ్లు

ఈ వ్యవస్థ ఎంతటి సృజనాత్మకమైనదో, దాని అమలులో అన్ని రకాల సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు, వీరికి అత్యాధునిక సాంకేతికతపై అవగాహన తక్కువగా ఉండడం ప్రధాన అడ్డంకిగా మారచ్చు. ఈ ల్యాబ్ ఏటీఎం మెషీన్ ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడితే, అది వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి బదులుగా మరింత గందరగోళానికి దారి తీయవచ్చు. ఆసుపత్రి సిబ్బందికి కూడా ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ మెషీన్లలో సాంకేతిక లోపాలు తలెత్తితే, మొత్తం వైద్య ప్రక్రియే నిలిచిపోయే ప్రమాదం ఉంది.

పేదలకు ఆర్థిక ఊరట

ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా ప్రాథమిక పరీక్షలు దాదాపు ఉచితంగా అందడం వల్ల, ప్రైవేట్ ల్యాబ్‌లకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పేదలకు ఇది అతి పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పచ్చు. అయితే, డిజిటల్ రికార్డుల అనుసంధానంలో లోపాలు తలెత్తితే రోగులు మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సి రావడం వంటి ఆర్థిక భారాలు పడే అవకాశం కూడా ఉంది. అందుకే, సాంకేతికతను ప్రవేశపెట్టడమే కాకుండా, వాటిని నిర్వహించడానికి సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ విజయవంతమైతే, దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News