అమెరికాలో భారతీయ కుటుంబంపై పెప్పర్ స్ప్రే దాడి.. కలకలం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, శాన్ ఆంటోనియోలో భారతీయ కుటుంబంపై జరిగిన షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.;

Update: 2025-11-24 08:25 GMT

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, శాన్ ఆంటోనియోలో భారతీయ కుటుంబంపై జరిగిన షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శాన్ ఆంటోనియో రివర్ వాక్‌లో గో రియో బోట్ టూర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిపై పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడ్డారు. వారిలో ఒక మహిళ , ఒక చిన్నారి కూడా ఉంది.

* మహిళ ఆగ్రహం, అకస్మాత్తు దాడి

నవంబర్ 15వ తేదీ శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోట్‌లో ప్రయాణిస్తున్న మహిళ తన ఫోన్ వాల్యూమ్‌ను తగ్గించాలని బోట్ ఆపరేటర్ పదేపదే కోరాడు. దీనిపై ఆ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో బోట్ ఆపరేటర్ బోట్‌ను ఆపి, ఆమెను వెంటనే దిగాల్సిందిగా సూచించాడు. బోట్ నుంచి దిగిన వెంటనే, ఆమె ప్రయాణికులపై గట్టిగా అరిచింది. అనంతరం తన బ్యాగ్‌లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి, బార్జ్‌పై ఉన్నవారిపై పిచికారీ చేసింది. శాన్ ఆంటోనియో పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ దగ్గరలోని బ్రిడ్జ్‌పైకి వెళ్లి అక్కడి నుంచి బోట్‌లో ఉన్న ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే చేసింది.

చిన్నారి తీవ్ర అస్వస్థత

ఈ దాడిలో భారతీయ కుటుంబంలోని ఒక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోల్లో చిన్నారి తన తల్లి దగ్గర ఏడుస్తూ కళ్లు రుద్దుకుంటూ కనిపించింది. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించగా, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

సాక్షులు, సోషల్ మీడియాలో చర్చ

దాడి చేసిన మహిళ వెంటనే అక్కడి నుంచి పారిపోయిందని సాక్షులు పేర్కొన్నారు. ఆమెను పోలీసులు ఇంకా గుర్తించలేదు. పెప్పర్ స్ప్రే ఆమె బ్యాగ్ నుంచి వేలాడుతున్నట్టుగా కనిపించిందని పలువురు సాక్షులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో టిక్‌టాక్‌లో షేర్ అయి, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఎన్ఆర్ఐల కోసం నడపబడే పాపులర్ పేజీలు కూడా ఈ ఫుటేజీలను షేర్ చేశాయి. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్‌లో మాట్లాడుతూ, దాడికి గురైన భారతీయ కుటుంబం తన స్నేహితులదని, వారు ఈ ఘటనపై అధికారికంగా కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

* పోలీసుల గాలింపు, భద్రతా సమస్యలు

మిస్సౌరీ నుంచి వచ్చిన పర్యాటకుడు ఆండీ మోరాన్ మాట్లాడుతూ, “ఎటువంటి కారణం లేకుండా ఒక మహిళ ఇంతమంది మీద పెప్పర్ స్ప్రే చేయడం నమ్మశక్యం కానివిషయం,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

దాడికి పాల్పడిన మహిళను గుర్తించేందుకు శాన్ ఆంటోనియో పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన అమెరికాలో పెరుగుతున్న ప్రజా భద్రతా సమస్యలను మరియు విదేశీయులపై జరుగుతున్న అకస్మాత్తు దాడులను మరోసారి వెలుగులోకి తెచ్చింది.



Tags:    

Similar News