బుల్లెట్ మిస్ ఫైర్.. కెనడాలో భారతీయ విద్యార్థిని దుర్మరణం

హమిల్టన్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న హర్‌సిమ్రత్‌, స్థానిక బస్టాప్‌ వద్ద వేచి ఉండగా దుండగుడి కాల్పులకు బలయ్యింది.;

Update: 2025-04-19 06:33 GMT

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు, భారతీయులపై జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో తాజాగా మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఒంటారియోలో జరిగిన కాల్పుల్లో హర్‌సిమ్రత్‌ రంధవా అనే భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం గురువారం ధృవీకరించింది.

హమిల్టన్‌లోని ఓ కళాశాలలో చదువుతున్న హర్‌సిమ్రత్‌, స్థానిక బస్టాప్‌ వద్ద వేచి ఉండగా దుండగుడి కాల్పులకు బలయ్యింది. ఒక కారులో వచ్చిన దుండగుడు, బస్టాప్‌లో ఆగి ఉన్న మరో వాహనంలోని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తు ఆ బుల్లెట్లలో ఒకటి లక్ష్యం తప్పి హర్‌సిమ్రత్‌కు తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న హర్‌సిమ్రత్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పులు జరిగిన వెంటనే రెండు వాహనాలు అక్కడి నుంచి పరారయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

హర్‌సిమ్రత్‌ మృతి పట్ల కెనడాలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమాయక విద్యార్థిని కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇటీవల ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్‌ ప్రాంతంలో ఒక భారతీయ వ్యక్తి కత్తిపోట్లకు గురై మృతి చెందిన ఘటన మరవకముందే, ఈ కొత్త సంఘటన కెనడాలో ఉంటున్న భారతీయుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఆ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

కెనడాలో వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడులు భారతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై కెనడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News