చంద్రబాబు వల్లే సింగపూర్‌లో ఉన్నా.. ఏపీకి రోల్స్ రాయిస్ తెస్తా..

4వ సారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి సింగపూర్‌కు సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో భార్యా పిల్లలు, స్నేహితులతో కలిసి ఎన్ఆర్ఐలు డయాస్పోరాకు భారీగా హాజరయ్యారు.;

Update: 2025-07-28 12:32 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది. వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌తో సహా పక్కనే ఉన్న మరో ఐదు దేశాల నుంచి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఊహకుమించిన స్థాయిలో తెలుగు వారు రాకతో ఆడిటోరియం నిండిపోయింది. తెలుగు ప్రజల ఆనందం, సంతోషాల నడుము సుమారు ఐదు గంటల పాటు పండుగలా డయాస్పోరా కార్యక్రమం వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఓ తెలుగు మహిళా టెకీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాబు విజన్ తో సింగపూర్ వచ్చా..

4వ సారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి సింగపూర్‌కు సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో భార్యా పిల్లలు, స్నేహితులతో కలిసి ఎన్ఆర్ఐలు డయాస్పోరాకు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. అనంతరం వారి అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రోల్స్ రాయిస్ కంపెనీలో ఏఐ హెడ్ గా పనిచేస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే తాము ఈ రోజు ఈ స్థితికి వచ్చామని ఆనందంగా వెల్లడించారు. దీంతో సభలో అంతా చప్పట్లు కొట్టి హర్షం ప్రకటించారు.

ఏపీకి రోల్స్ రాయిస్ కంపెనీ తీసుకువస్తా..

తెలుగు డయాస్పొరా కార్యక్రమానికి వచ్చిన ఆ మహిళా టెకీ చంద్రబాబు పనితీరుపై అభినందనలు తెలిపారు. గతంలో ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్లే తనలాంటి టెకీలు ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఏపీ అభివృద్ధికి చేదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో పేదరిక నిర్మూలన కోసం తాను ప్రవేశపెట్టిన పీ-4 పథకంలో చేరి తోటివారికి సహాయం చేయాలని ఆ మహిళా ఉద్యోగిని కోరారు. దీనికి ఆమె అంగీకరిస్తున్నట్లు తెలపడం విశేషం. ఇలా సింగపూర్ లో జరిగిన తెలుగు డయాస్పొరా సమావేశం మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News