భార్య వివాహేతర సంబంధం నేరం కాదు : హైకోర్టు సంచలన తీర్పు

భార్యను ఆస్తిగా భావించే కాలం చెల్లిందని, మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.;

Update: 2025-04-19 07:07 GMT

భార్యను ఆస్తిగా భావించే కాలం చెల్లిందని, మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.., తన భార్య ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరిన భర్తకు నిరాశ ఎదురైంది. ఈ తీర్పు వివాహిత ప్రియుడికి ఊరట కలిగించగా, భార్య ప్రవర్తనతో ఆవేదన చెందిన భర్తకు షాక్‌లా తగిలింది.

వివరాల్లోకి వెళితే.., ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటాన్ని గుర్తించాడు. తన భార్య హద్దులు మీరి ప్రవర్తిస్తోందని, ఆమె ప్రియుడితో శారీరక సంబంధం నేరమని ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఒక హోటల్ గదిలో తన భార్య ప్రియుడితో కలిసి ఉన్నట్లు కూడా అతడు ఆరోపించాడు.

ఈ కేసు మొదట మెజిస్ట్రేట్ కోర్టుకు రాగా, ప్రియుడిని దోషిగా చూడటం సరికాదని తీర్పు వెలువరించింది. దీంతో అతడికి ఊరట లభించింది. అయితే, భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ ప్రియుడికి నోటీసులు జారీ చేసింది.

దీంతో తనపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వివాహిత ప్రియుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక స్త్రీని భర్త తన ఆస్తిగా చూడటం వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహాభారతంలోని ద్రౌపది ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ, వారిలో ఒకరైన ధర్మరాజు ఆమెను జూదంలో పణంగా పెట్టాడని గుర్తు చేశారు. మిగిలిన నలుగురు భర్తలు ప్రేక్షక పాత్ర వహించడం వల్ల, ద్రౌపది తన గౌరవం కోసం నిలబడే అవకాశం కోల్పోయిందని కోర్టు పేర్కొంది.

మహిళను ఒక ఆస్తిగా పరిగణించడం ఎంతటి ప్రమాదకరమో మహాభారత యుద్ధం నిరూపించిందని, దాని ఫలితంగా భారీ ప్రాణనష్టం సంభవించిందని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

స్త్రీని ఆస్తిగా చూడటం సరైనది కాదని, మహాభారత కాలం నాటి ఆలోచనలకు ఇప్పుడు కాలం చెల్లిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం అనేది నైతికతకు సంబంధించిన విషయమని, దానిని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పిందని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, భర్త చేసిన ఫిర్యాదు కేసును రద్దు చేసే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

చివరికి, సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రియుడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో వివాహేతర సంబంధం నేరమని వాదిస్తున్న భర్తకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తన భార్య వివాహేతర సంబంధంపై చర్యలు తీసుకునే అవకాశం లేదా అని ఆ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ తీర్పు సమాజంలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, మరోవైపు వివాహ వ్యవస్థ పవిత్రత వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రస్తుత చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం నేరం కాదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News