వంశీ కథ మళ్లీ మొదటికి.. సుప్రీంలో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.;
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ప్రభుత్వ వాదనలు వినకుండా హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. అక్రమ మైనింగు కేసులో హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ సుప్రీం ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిలు మంజూరు చేయడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా మరోమారు వంశీ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విన్న తర్వాత తీర్పు నివ్వాలని ఆదేశించింది. సుప్రీంలో విచారణ సందర్భంగా కేసు మెరిట్స్, పీటీ వారంట్స్ లోకి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది సుప్రీం. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లోవిచారణ ముగించి తీర్పునివ్వాలని ఏపీ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాగా, గత ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయవాడకు తరలించిన పోలీసులు పలు పీటి వారంట్ల ద్వారా సుమారు 140 రోజులు వంశీని జైలులో ఉంచారు. సుమారు 11 కేసులు నమోదు చేయగా, అన్ని కేసుల్లో బెయిలు మంజూరు కావడంతో ఈ నెల 2న వంశీ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే గన్నవరం నియోజకవర్గంలోని అక్రమ మైనింగు కేసులో ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేయడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పునర్విచారణకు ఆదేశించింది. దీంతో వంశీ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మాజీ ఎమ్మెల్యే మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు. సుప్రీం తీర్పుపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయని అంటున్నారు.