నేడే తీర్పు : ఫిర్యాయింపు ఎమ్మెల్యేల మీద వేటు పడుతుందా ?

దాని మీద బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. అది కాస్తా సుప్రీంకోర్టు దాకా చేరింది అనేక రకాలైన వాదోపవాదాలు జరిగిన మీదట సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది.;

Update: 2025-07-31 03:31 GMT

తెలంగాణాలో ఇలా అధికారం మారడంతో అలా బీఆర్ఎస్ నుంచి పది మంది దాకా ఎమ్మెల్యేలు ఫిరాయించారు. గులాబీ పార్టీ గుర్తు అయిన కారుతో గెలిచి హస్తం గూటికి చేరిపోయారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా కొనసాగుతున్నారు. దాని మీద బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. అది కాస్తా సుప్రీంకోర్టు దాకా చేరింది అనేక రకాలైన వాదోపవాదాలు జరిగిన మీదట సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది.

బలంగా వాదనలు :

ఇక చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం తన తీర్పుని వెలువరించబోతోంది.గురువారం ఈ తీర్పు రానుంది. తమ పార్టీ గుర్తు మీద నెగ్గి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టుని ఆశ్రయించడమే కాదు బలమైన వాదనలు వినిపించింది. ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు అని కూడా బీఆర్ ఎస్ పేర్కొంది.

ఎలా ఉండబోతోంది :

ఫిరాయింపుల అంశం మీద చీఫ్ జస్టిస్ అధ్యతనన ఏర్పాటైన ధర్మాసనం ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయానికి కాల పరిమితి అంటూ లేదని అవతల అసెంబ్లీ స్పీకర్ వైపు వాదనలు సీనియర్ కౌన్సిల్ గా ఉన్న ముకుల్ రోహిత్గి వినిపించారు. స్పీకర్ కి రాజ్యాంగం కల్పించిన విశేషమైన రాజ్యాంగ అధికారం విషయంలో కోర్టులు ప్రశ్నించడానికి లేదని ఆయన పేర్కొన్నారు అయితే ఈ సందర్భంగా నాలుగేళ్ళు గడచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా అని జస్టిస్ బీఆర్ గవాయ్ గత విచారణలో ప్రశ్నించడం విశేషం.

ఫిర్యాయింపులకు చెక్ పెట్టేలా :

ఇక సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు అయితే ఫిరాయింపులకు చెక్ పెట్టేలా ఉండబోతోందా అన్న చర్చ సాగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ ఆదేశాలు జారీ చేయకూడదని ఉన్నా దానికి కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉండాలి కదా అన్న చర్చ అయితే చాలా కాలంగా ఉంది. తన వద్దకు ఫిరాయింపుల అంశం వచ్చినపుడు ఒక కాల పరిమితిలో స్పీకర్లు నిర్ణయం తీసుకునేలా విధానం ఉండాలని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అయితే కోరుతున్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన దిశా నిర్దేశం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News