వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నేరం.. సుప్రీం సంచలన ఆదేశాలు
పల్లెల సంగతి ఏమో కానీ.. పట్టణాలు, నగరాల్లో వీధి కుక్కల బెడద చాలా తీవ్రం అనే చెప్పాలి. పైగా కొందరు వీటికి వీధుల్లో ఆహారం పెడుతూ పోషిస్తుంటారు.;
ప్రజలపై దాడులు పెరిగిపోయాయి.. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదు... అంటూ ఈ నెల 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు నిరసన స్వరం వినిపించారు. దీంతో తమ ఉత్తర్వులను సవరిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వీధి కుక్కలకు సంబంధించి మరిన్ని నిర్దిష్టమైన అంశాలను తాజా ఉత్తర్వుల్లో జోడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు నాయ్యమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన త్రిసభ్య బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
వీధుల్లో ఆహారం చట్ట విరుద్ధం
పల్లెల సంగతి ఏమో కానీ.. పట్టణాలు, నగరాల్లో వీధి కుక్కల బెడద చాలా తీవ్రం అనే చెప్పాలి. పైగా కొందరు వీటికి వీధుల్లో ఆహారం పెడుతూ పోషిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధులు, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఫలానా ప్రదేశంలోనే ఆహారం అందించాలని.. దీనికోసం అధికారులు ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు...
సామాన్య ప్రజలు వీధుల్లో వెళ్తుంటే కుక్కలు ఇబ్బందులు పెడుతున్నాయని, అందుకని వీధుల్లో వాటికి ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టొద్దని, పెడితే గనుక చట్టప్రకారం చర్యలు ఉంటాయని సుప్రీం కోర్టు హెచ్చరించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. వీధి కుక్కల విషయంలో అసలు ఒక నియంత్రణ అంటూ లేకపోవడంతోనే అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని నివేదికలు వచ్చాయని వాటి ప్రకారం తాము ఆదేశాలు ఇస్తున్నామని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
వాటిని వదలొద్దు...
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన ఉన్న వీధి కుక్కలను తప్పించి షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, టీకా, స్టెరిలైజేషన్ తర్వాత వాటిని ఎక్కడనుంచి తెచ్చారో అక్కడే వదలాలని సూచించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.