ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏం జరుగనుంది?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.;

Update: 2025-07-31 07:38 GMT

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు నెలల గడువులోపు స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

రాజ్యాంగ పరిరక్షణలో భాగం: కోర్టు వ్యాఖ్యలు

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. "అనర్హత నిర్ణయం తీసుకోవడం మేము చేయలేం. అది పూర్తిగా స్పీకర్ పరిధిలోకి వచ్చే వ్యవహారం. మేము తలదూర్చడం రాజ్యాంగ ఉల్లంఘనకు దారితీస్తుంది. కానీ దీన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం కూడా సరికాదు. కాబట్టి స్పీకర్‌కు గడువు విధించాల్సి వస్తోంది" అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను పునరుద్ఘాటిస్తూ, పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన గైడ్‌లైన్లను నిర్దేశించినట్లు భావిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క ప్రాముఖ్యతను ఈ తీర్పు మరోసారి నొక్కి చెప్పింది.

కేసుల వెనక నేపథ్యం

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్ గౌడ్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డిలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వేరుగా రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు నేడు ఈ కీలక తీర్పును వెలువరించింది.

-రాజకీయ దుమారం, ఆసక్తికర పరిణామాలు

సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో మినీ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరోమారు వేడెక్కనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సవాలుగా మారే అవకాశం ఉంది.

న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టంగా సూచించింది. "స్పీకర్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అనవసర ఆలస్యం చోటు చేసుకోరాదు." ఈ తీర్పు దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై చర్చలకు దారితీసేలా ఉంది. రాజకీయ నీతిని పరిరక్షించేందుకు, ప్రజల అభిమతాన్ని గౌరవించేందుకు ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, తెలంగాణ స్పీకర్ తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. స్పీకర్ నిర్ణయంపైనే పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.

Tags:    

Similar News