ఆర్ ఆర్ ఆర్ టార్చర్ కేసులో డాక్టర్‌కు షాక్: సుప్రీం ఫైర్
అయితే.. డాక్టర్ ప్రభావతి.. సీఐడీ విచారణకు సహకరించకపోగా.. తాను లేనని సమాధానం చెబుతున్నారు.;
ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు..కేర్ ఫ్ ఆర్ ఆర్ ఆర్.. ను వైసీపీ హయాంలో టార్చర్ చేసి.. ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదుపై ఏపీ సీఐడీ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఆర్ ఆర్ ఆర్‌ను స్టేషన్‌లో పెట్టి చితక్కొట్టేశారని.. చంపేయలని చూశారన్న ఫిర్యాదుపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ చేయిస్తోంది.
ఈ క్రమంలో ఆనాడు ఆర్ ఆర్ ఆర్‌ను సీఐడీ అధికారులు చితక్కొట్టేసినా.. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంటూ.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరింటెండెంట్‌గా పనిచేసిన మహిళా వైద్యురాలు ప్రభావతి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే.. ఇది నకిలీదని.. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఆమె అలా చేశారని పేర్కొంటూ.. రఘురామ కోర్టుకు ఎక్కడంతో ఆమెను కూడా విచారించేందుకు సీఐడీ అధికారులు రెడీ అయ్యారు.
అయితే.. డాక్టర్ ప్రభావతి.. సీఐడీ విచారణకు సహకరించకపోగా.. తాను లేనని సమాధానం చెబుతున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆమెనే మందలించడం గమనార్హం. ``సమాజంలో ఉన్న స్థానంలో ఉన్న మీరే.. పోలీసు విచారణకు సహకరించకపోతే ఎలా?`` అంటూ.. ప్రశ్నించింది.
ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే సీఐడీ విచారణకు డాక్టర్ ప్రభావతి తప్పకుండా హాజరు కావాల్సిందేనని సు ప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన లూథ్రాను కూడా సుప్రీంకోర్టు వారించింది. ప్రతి విషయాన్నీ యాగీ చేయడం కాదని.. ప్రతివాదులకు కూడా సమయం ఇవ్వాలని సూచించింది. ప్రభావతిని అరెస్టు చేయకుండా విచారించే మార్గం చూడాలని.. ఆమె కూడా సహకరించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.