టీనేజీ బాలిక అబర్షాన్ కేసు : మీ చట్టాలను మార్చండి అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశంలో అత్యాచార బాధితుల హక్కులు.. ముఖ్యంగా మైనర్ బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం ఒక చారిత్రాత్మకమైన, సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.;
దేశంలో అత్యాచార బాధితుల హక్కులు.. ముఖ్యంగా మైనర్ బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం ఒక చారిత్రాత్మకమైన, సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల అత్యాచార బాధితురాలికి సంబంధించిన గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం, మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన పాత చట్టాలను పునఃసమీక్షించాలని, అవసరమైతే సమూల మార్పులు చేయాలని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం.. కోర్టు అనుమతి
కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై సుమారు 30 వారాల గర్భంతో గర్భవిచ్ఛిత్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారతీయ చట్టాల ప్రకారం , నిర్ణీత పరిమితి దాటిన తర్వాత గర్భవిచ్ఛిత్తికి న్యాయపరమైన అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో గత విచారణలో సుప్రీంకోర్టు స్పందిస్తూ, "ఒక మహిళను అందులోనూ ఒక మైనర్ బాలికను ఆమె ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం అత్యంత అమానవీయం" అని పేర్కొంటూ గర్భవిచ్ఛిత్తికి పచ్చజెండా ఊపింది.
ఎయిమ్స్ అభ్యంతరం.. న్యాయస్థానం స్పందన
అయితే ఈ తీర్పుపై ఢిల్లీలోని ఎయిమ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. 30 వారాల గర్భం అంటే అది దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నట్లేనని, ఈ దశలో అబార్షన్ చేయడం వల్ల బాలిక ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు వారాలు వేచి చూస్తే, బిడ్డకు జన్మనిచ్చి, ఆ తర్వాత ఆ శిశువును దత్తతకు ఇచ్చే వెసులుబాటు ఉంటుందని వారు సూచించారు.
ఈ వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కేవలం వైద్య పరమైన కోణంలోనే కాకుండా, బాధితురాలి మానసిక , సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. "ఆ బాలిక ఎదుర్కొన్నది సాధారణ గర్భం కాదు, అది అత్యాచారం వల్ల కలిగిన ఫలితం. ఆ దారుణ ఘటన ఆమెను జీవితాంతం మానసిక క్షోభకు గురిచేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గర్భాన్ని మోయమని ఆమెను ఒత్తిడి చేయడం ఆమె ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చట్టాల్లో మార్పులు అవసరం.. కేంద్రానికి సూచన
ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎంటీపీ యాక్ట్ లో ఉన్న నిబంధనలు అత్యాచార బాధితుల పట్ల కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రస్తుత చట్టంలోని 20 లేదా 24 వారాల గర్భవిచ్ఛిత్తి పరిమితిని, అత్యాచార బాధితుల విషయంలో ప్రత్యేక వెసులుబాటుతో పెంచేలా మార్పులు చేయాలి. గర్భవిచ్ఛిత్తి నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా, బాధితురాలి మానసిక స్థితిని ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బాధితురాలు ఆమె తల్లిదండ్రులకే వదిలేయాలని, వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
వైద్యుల నివేదిక ప్రకారం బాలిక ప్రాణాలకు ముప్పు లేదని నిర్ధారిస్తే ఆమె ఇష్టపూర్వకంగా గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చని కోర్టు పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా మహిళల హక్కులు శరీర స్వయంప్రతిపత్తి పై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో చట్టపరమైన సంస్కరణలకు నాంది పలికేలా ఉన్నాయి. న్యాయవ్యవస్థ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై మహిళా హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.