కుక్క మూడ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ?

వీధి కుక్కల మీద దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలు ఇపుడు చర్చకు తావిస్తున్నాయి.;

Update: 2026-01-08 03:39 GMT

వీధి కుక్కల మీద దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలు ఇపుడు చర్చకు తావిస్తున్నాయి. వీధి కుక్కల వల్ల చాలా మంది బలి అవుతున్నారు. చిన్నారులు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకనాడు పెంపుడు జంతువులుగా ఇవి ఉన్నా ఇపుడు మాత్రం అవి జనాలను చంపే జంతువుల జాబితాలోకి వెళ్తున్నాయి జంతు సంక్షేమ సంఘాల పెద్దలు ఏమి చెప్పినా వీధి కుక్కల బారిన పడిన వారు మాత్రం వాటి విషయంలో పాలకులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వీధి కుక్కల బెడద మీద సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. ఈ సందర్భంగా వీధి కుక్కల విషయంలో ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది.

కుక్క మనసు ఎవరు చదువుతారు :

ఒక వీధి కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరికి తెలుసు అని సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద వ్యాఖ్యానించింది. కరిచిన తరువాత చికిత్స అంటూ మొదలెట్టే కంటే కరవకుండా తగిన నివారణ తరుణోపాయం చేయడమే ఉత్తమమని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

గతంలోనే ఆదేశాలు :

ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు నవంబర్ 7వ తేదీన వీధి కుక్కల విషయంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు ఆసుపత్రులు రైల్వే స్టేషన్లలో జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలలో కుక్కల బెడద లేకుండా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కుక్కలను పట్టుకుని స్టెరీలిజేషన్ టీకాల తరువాత వాటిని షెల్టర్లకు తరలించాలని సూచించింది. వాటిని ఎక్కడ పట్టుకున్నా షెల్టర్ల వద్దకే చేర్చాలని అంతే తప్ప మళ్ళీ రోడ్ల మీదకు వదిలేయవద్దు అని కూడా గట్టిగా కోరింది. గత ఏడాది జూలైలో కూడా ఇదే తీరున ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. అది కేవలం ఢిల్లీకే పరిమితమై ఇచ్చిన ఆదేశం. అయితే తరువాత దేశమంతా అమలు చేయాలని నవంబర్ లో మరో ఆదేశం జారీ చేసింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు తమ ఆదేశాలు అంతా పాటించాలని కోరడం విశేషం.

ఒక్క రేబిస్ మరణం ఉండరాదు :

కుక్కల కారణంగా ఏ ఒక్క రేబిస్ మరణం కూడా దేశంలో నమోదు కారాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎవరు అడ్డుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక దాణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్ని మునిసిపాలిటీలను కోరింది. ఎవరైనా వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వరాదని అలా అనుమతించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా ఉల్లంఘిస్తే తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మొత్తం మీద వీధి కుక్కల విషయంలో కఠినంగా ఉండాలని కుక్క కాటుకు ఎవరూ గురి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం బలంగా ఒక వైపు కోరుకుంటూంటే మరో వైపు చూస్తే ప్రభుత్వాలు అధికారులు ఆ దిశగా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. రేబిస్ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తేవడం కాదు, కుక్క కాటే పడకుండా చూడాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తేనే కుక్కల నుంచి ముక్తీ మోక్షం ఈ దేశానికి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News