ఎర్రకోట ఒక్కటేనా.. తాజ్ వద్దా? మొఘల్ వారసురాలికి సుప్రీం షాక్
మొఘల్ వారసురాలికి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది.;
మొఘల్ వారసురాలికి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎర్రకోటను తనకు అప్పగించాలని మొఘల్ చక్రవర్తుల వారసురాలు చేసిన అభ్యర్థనను తోసి పుచ్చటమే కాదు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎర్రకోట మాత్రమే సరిపోతుందా? తాజ్ మహాల్.. ఫతేపూర్ సిక్రీ వద్దా?’ అంటూ ప్రశ్నించింది.
చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 2 మునిమనమడు బెదర్ భక్త భార్య సుల్తానా బేగం సుప్రీకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రకోటను తనకు అప్పగించాలని ఆమె కోరారు. ఎర్రకోటకు అసలైన యజమానులైన మొఘల్ చక్రవర్తుల ప్రత్యక్ష వారసురాలు అనే కారణంతో దాన్ని తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.ఆమె.. కోల్ కతా సమీపంలోని హౌరాలో నివసిస్తున్నారు.
ఈ పిటిషన్ పై దిగ్భాంత్రికి గురైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. ‘ఎర్రకోట మాత్రమే ఎందుకు? ఫతేపూర్ సిక్రీ.. తాజ్ మహల్ ను కూడా ఎందుకు అడగట్లేదు? మీరు దీని గురించి వాదించాలనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. పిటిషన్ ను కొట్టేశారు. ఒకవేళ కుదరదంటే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అయితే.. ఈ తరహా అంశాలతో కోర్టు గడప ఎక్కటం ఇదేమీ మొదటిసారి కాదంటున్నారు.
గతంలోనూ సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త మొఘల్ వారసుడని.. బహదూర్ షా వారసుడిగా ప్రభుత్వం 1960లలోనే గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఆయా అంశాల్ని ప్రస్తావిస్తూ.. 2021లో ఎర్రకోటను తనకు అప్పగించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు దానికి కొట్టేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. కాస్తంత ఆగిన ఆమె తాజాగా సుప్రీంకోర్టులో అదే తరహా పిటిషన్ ను దాఖలు చేయటం.. దానికి కొట్టేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.