బిగ్ బ్రేకింగ్ : లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డికి ఊరట
వైసీపీ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.;
వైసీపీ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాంలో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ పోలీసులను ఆదేశించింది. దీంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురిని విచారించిన సీఐడీ పోలీసులు.. వైసీపీ నేత రాజ్ కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డిపై ఇప్పటివరకు సీఐడీ ఎలాంటి అభియోగాలు నమోదు చేయనప్పటికీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారంతో మిథున్ రెడ్డి అప్రమత్తమయ్యారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ లోగా గత శనివారం ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లడంతో కలకలం రేగింది. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు వచ్చారంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఐడీ అధికారులు సోమవారం వెలువడే సుప్రీం నిర్ణయం కోసం వేచిచూశారంటున్నారు. సుప్రీం తీర్పు అనుకూలంగా రావడంతో ఎంపీ మిథున్ రెడ్డికి పెద్ద చిక్కు తప్పినట్లైంది.