కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. బీఆర్ఎస్ లో కలకలం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.;
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల వేడుకలలో భాగంగా ఇటీవల అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో భారీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇంగ్లాండులోనూ కేటీఆర్ పర్యటించి, తెలంగాణ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు జరుపుతున్నారు.
ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ కీలక నాయకులు ఉన్నారు. అమెరికాలో జరిగిన రజత వేడుకలలో పాల్గొన్న కేటీఆర్, అక్కడ స్థిరపడిన తెలంగాణ వ్యాపారులు, నిపుణులతో భేటీ అయ్యారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. "మీరు ఎక్కడ స్థిరపడినా.. తెలంగాణ అనేది పురిటి గడ్డ అని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దని" కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనికి అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వ్యాపారులు సానుకూలంగా స్పందించి, తెలంగాణలో పెట్టుబడులు పెడతామని, అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తామని పేర్కొన్నారు. కేటీఆర్ ఇంకా విదేశాలలోనే ఉండగానే, శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేయడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది.
ఇటీవలి కాలంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి తీవ్ర ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కీలక నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా కీలక విషయాలను బయటపెడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తొలిసారిగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు భారత సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
నోటీసులకు కారణం ఏమిటి?
ఇటీవల కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దలు రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదయింది. ఆ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కేటీఆర్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తన ఫిర్యాదుపై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, దానిని సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం దీనిని విచారించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది.
వాస్తవానికి, ఇటీవల కాలంలో కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వారంలో మూడు నాలుగు పర్యాయాలు విలేకరుల సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నప్పటికీ, కొంతమంది నాయకులు ఇదిగో ఇలా సర్వోన్నత న్యాయస్థానాల తలుపులు తడుతున్నారు. తద్వారా దూకుడు మీద ఉన్న ప్రతిపక్ష పార్టీకి స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు? సర్వోన్నత న్యాయస్థానానికి ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయని తెలుస్తోంది.