కేటీఆర్‌పై రెండు ఎఫ్ఐఆర్ రద్దు.. విషయం ఏంటంటే!
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసులు చెల్లబోవని వ్యాఖ్యానించింది.;
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసులు చెల్లబోవని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఇది రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసుగా పేర్కొన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్ ఐఆర్‌ను కొట్టి వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై డ్రోన్ ఎగురవేసిన కేసులోనూ.. కోర్టు ఎఫ్ఐఆర్ కొట్టివేసింది.
ఏం జరిగింది?
ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది పర్యటించిన కేటీఆర్.. మూసీ నది ప్రక్షాళన అంశాన్ని తీసుకువ చ్చారు. ప్రక్షాళన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో 25 కోట్ల రూపాయల మూటలను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సమర్పించారని.. ఇక్కడి సొమ్మును అక్కడకు పంపించుడు చూడండి.. అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే రాజకీయ దుమారం రేగింది. అయితే.. పార్టీ నాయకురాలు.. ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదైంది. పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యానించారని సుగుణ పేర్కొన్నారు. అయితే.. ఈ ఎఫ్ ఐఆర్‌పై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు దానిని కొట్టివే సింది. రాజకీయ నేతలు చేసే ప్రతి ఆరోపణలపైనా కేసులు ఎట్టుకుంటూ పోతే.. కోర్టుల సమయం కూడా సరిపోదని వ్యాఖ్యానించడం గమనార్హం.
అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ పర్యటించిన కేటీఆర్.. డ్రోన్ ఎగురవేసి.. రికార్డు చేశారంటూ.. కాంగ్రెస్ నేతలు ఫిర్యా దు చేశారు. దీంతో దీంతో అక్కడ కూడా కేసు నమోదైంది. తాజాగా ఈ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. కాగా.. కోర్టు తీర్పులపై స్పందించిన కేటీఆర్.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనడానికి కోర్టు తీర్పులే నిదర్శనమని వ్యాఖ్యానించారు.