మహిళా జడ్జిల్లో టాప్ తెలంగాణ.. ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడి

జనాభాకు తగ్గట్లు కోర్టు.. న్యాయమూర్తులు ఉన్నారా? ఎంత తేడా ఉంది? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాల్ని ఇండియన్ జస్టిస్ 2025 రిపోర్టు కళ్లకు కట్టినట్లుగా చూపింది.;

Update: 2025-04-17 08:35 GMT

దేశ న్యాయ వ్యవస్థ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పే రిపోర్టు ఒకటి విడుదలైంది. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల సంఖ్యతో పాటు ఖాళీలు.. పెండింగ్ కేసులు.. జనాభాకు తగ్గట్లు కోర్టు.. న్యాయమూర్తులు ఉన్నారా? ఎంత తేడా ఉంది? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాల్ని ఇండియన్ జస్టిస్ 2025 రిపోర్టు కళ్లకు కట్టినట్లుగా చూపింది.

2025 జనవరి నాటికి దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటినట్లుగా పేర్కొంది. జడ్జిల నియామకంలో ఆలస్యం.. జనాభాకు సరిపడా న్యాయమూర్తులు లేకపోవటం కూడా దీనికి కారణంగా పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ విచారణ.. వర్చువల్ పద్దతిలో విచారణలు జరపటం కారణంగా కేసుల విచారణలో వేగం పుంజుకున్న విషయాన్ని వెల్లడించింది. ఏటా నమోదవుతున్న కేసులకు మించి పిటిషన్లను పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్న వైనాన్ని రిపోర్టులో పేర్కొన్నారు. అదే సమయంలో హైకోర్టు.. ఇతర కిందిస్థాయి కోర్టుల్లోనూ కేసుల పరిష్కార రేటు మెరుగు పడినట్లుగా వెల్లడైంది. పలు సంస్థల సాయంతో ఈ అధ్యయనాన్ని చేపట్టారు.

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఆరంభానికి హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం మంది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా అలహాబాద్.. మధ్యప్రదేవ్ హైకోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తి మీద 15 వేల కేసుల పని భారం ఉంది. తెలంగాణలో 42 మంది జడ్జిలకు 30 మంది మాత్రమే ఉన్నారు. సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజానికి ప్రతి 98.8 లక్షల మంది జనాభాకు ఒక హైకోర్టు జడ్జి ఉండాలి. కానీ.. ప్రస్తుతం ప్రతి 12.3 లక్షల మంది జనాభాకు ఒక హైకోర్టు జడ్జి ఉన్నారు. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తి మీద 4వేల కేసుల పని భారం పడుతుంది. తెలంగాణలో మొత్తం 655 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా.. కేవలం 440 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు.

దేశంలోని జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం పెరిగిన వైనం వెల్లడైంది. 2017లో వీరి సంఖ్య 30 శాతం ఉంటే.. 2025లో ఇది కాస్తా 38.3 శాతానికి పెరిగింది. ఆసక్తికరంగా తెలంగాణ రాష్ట్రంలో 55.3 శాతం మందితో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. హైకోర్టుల్లో మహిళా జడ్జిల ప్రాతినిధ్యం దేశ వ్యాప్తంగా 14 శాతం ఉండగా.. తెలంగాణలో అత్యధికంగా 33.3 శాతం ఉండటం గమనార్హం. దేశంలోని అన్ని హైకోర్టులతో కలిపి ఒకే ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు.

Tags:    

Similar News