'ప్రమాదం కాదు హత్య'... అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు!
అవును... సింగర్ జుబిన్ గర్గ్ మరణం తీవ్ర చర్చనీయాంశమైన వేళ.. అస్సాం అసెంబ్లీలో ఇతని మరణంపై చర్చించడానికి ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.;
అస్సాం ప్రముఖ సింగర్ జుబిన్ గర్గ్ (52) సింగపూర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సింగర్ జుబిన్ ప్రమాదంలో మరణించలేదని.. ఆయనను హత్య చేశారని అసెంబ్లీలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అవును... సింగర్ జుబిన్ గర్గ్ మరణం తీవ్ర చర్చనీయాంశమైన వేళ.. అస్సాం అసెంబ్లీలో ఇతని మరణంపై చర్చించడానికి ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. జుబిన్ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించలేదని, ఆయనను కుట్రపూరితంగా హత్య చేశారని.. నేరం వెన్నుకున్న ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని తెలిపారు.
హత్య కేసులో ఛార్జ్ షీట్ సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారని చెప్పిన సీఎం.. ఆ నిందితులలో ఒకరు ఆయనను హత్య చేయగా.. మిగిలినవారు అతడికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ హత్యతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులపైనా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం.. జుబిన్ మరణంపై దర్యాప్తు చేయడానికి అస్సాం పోలీసుల నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) కింద ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి గౌహతి హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ సౌమిత్ర సైకియా నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది.
కాగా... సెప్టెంబర్ 19న సింగపూర్ లో జుబిన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తొలుత ఆయన స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరిగింది! అయితే.. విహార నౌకలో ప్రమాదానికి గురయ్యారని, ఆయనను సింగపూర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే మృతి చెందారని వార్తలు వచ్చాయి.
అయితే... ఇటీవల జుబిన్ బ్యాండ్ మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... జుబిన్ కి ఆయన మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజర్ విషమిచ్చి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
మరోవైపు సింగపూర్ పోలీస్ ఫోర్స్ (ఎస్.పీ.ఎఫ్) కూడా గార్గ్ మరణంపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహిస్తోంది.