అత‌డి ప్ర‌పంచాన్నే మార్చేసిన పిల్ల‌లు!

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్రికెట్ లో యాక్టివ్ లో లేక‌పోయినా? అంత సుల‌భంగా మ‌ర్చిపోయే క‌టౌట్ కాద‌ది.;

Update: 2026-05-08 17:30 GMT

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్రికెట్ లో యాక్టివ్ లో లేక‌పోయినా? అంత సుల‌భంగా మ‌ర్చిపోయే క‌టౌట్ కాద‌ది. భార‌తీయ క్రియెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసిపెట్టుకునే వైదొలిగిన హిట్ట‌ర్ అత‌డు. అంతేనా మ‌హ‌మ్మారి క్యాన్స‌ర్ తో పోరాడి గెలిచిన ఓ యోధుడు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూవీ తనలో సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించారు. తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన పెను మార్పుల గురించి యువరాజ్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తన ఇద్దరు పిల్లలు (కుమారుడు ఓరియన్, కుమార్తె ఔరా) తన ప్రపంచాన్నే మార్చేశారన్నారు.

ప్ర‌స్తుతం తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకొచ్చారు. పిల్లల పెంపకం విషయంలో తన ఆలోచనా దృక్పథం ఎలా ఉంటుందో వివ‌రించారు. `పిల్లలు కేవలం ఆటలకే పరిమితం కాకూడదు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలని అభిప్రాయపడ్డారు. `పిల్లలు స్పోర్ట్స్, చదువు ఇలా ప్రతిదీ చేయాల‌న్నారు. ఒకే రంగానికి వారిని పరిమితం చేయడం కంటే అన్ని విషయాల్లో అవగాహన కల్పించడం తో పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదుగుతారని యూవీ నమ్ముతున్నారు. క్రికెట్ కెరీర్‌లో ఎంతో బిజీగా గడిపిన యువీ.. ఇప్పుడు తన సమయాన్ని పిల్లల కోసమే వెచ్చిస్తున్నట్లు యూవీ తెలిపారు.

తండ్రి కాకముందు తన దృష్టి అంతా ఆటపైనే ఉండేదని కానీ ఇప్పుడు పిల్లల చిన్న చిన్న అవసరాలు, వారి అల్లరి, ఎదుగుదలను గమనించడంలోనే తనకు అసలైన ఆనందం దొరుకుతోందన్నారు. తండ్రి బాధ్యత తనలో మరింత సహనాన్ని, పరిణతిని నింపిందన్నారు. తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తనను క్రమశిక్షణతో పెంచిన తీరుకు, తాను తన పిల్లలను పెంచుతోన్న తీరుకు ఉన్న వ్యత్యాసాన్ని కూడా యూవీ పరోక్షంగా గుర్తు చేసుకున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వారు కచ్చితంగా క్రికెటర్లే అవ్వాలని తాను ఒత్తిడి చేయనని స్పష్టం చేశారు.

వారికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే అందులో ప్రోత్సహిస్తాన‌న్నారు. అయితే శారీరక దృఢత్వం కోసం క్రీడలు, మేధో వికాసం కోసం విద్య రెండూ సమానంగా అవసరమని నొక్కి చెప్పారు. నేటి తరం పిల్లలకు క్రమశిక్షణతో కూడిన స్వేచ్ఛను ఇవ్వడం ముఖ్యమని భావిస్తున్నారు. స్పోర్ట్స్ పట్ల మక్కువ పెంచుకుంటూనే విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని యూవీ వెల్లడించారు. యువరాజ్ భార్య హేజిల్ కీచ్ కూడా పిల్లల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తామిద్దరం కలిసి పిల్లలకు మంచి విలువలని నేర్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో తరచూ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసే యువీ వారిని లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచుతూనే బాల్యాన్ని ఆస్వా దించేలా చూస్తున్నారన్నారు. సెలబ్రిటీగా ఉండటం కంటే బాధ్యతాయుతమైన తండ్రిగా ఉండటమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని హేజిల్ కీచ్ గర్వంగా చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News