ఏపీలో వంటీర్లకు ఆరేళ్లు.. అందరూ మరిచిపోయారు.. !
ఈ వ్యవస్థ అప్పట్లో పెను సంచలనంగా మారింది. పొరుగున్న ఉన్న తమిళనాడు, కర్ణాటక సహా.. పంజాబ్ ప్రభుత్వాలు కూడా ఏపీకి వచ్చి వలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేశాయి.;
రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రత్యేక వ్యవస్థగా.. మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సమాంతర వ్యవ స్థగా ఏర్పడిన వలంటీర్ వ్యవస్థ.. వచ్చి ఈ నెల 15 నాటికి ఆరేళ్లు నిండుతాయి. 2019లో వైసీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే.. ఎవరూ ఊహించని విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. జూలై తొలి వారంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. కేవలం 40 రోజుల్లోనే పరీక్షలు కూడా పూర్తి చేసి.. ఆగస్టు 15 నాటికి వలంటీర్లను ఎంపిక చేసింది. సుమారు 6 లక్షల మందిని తీసుకుందామని భావించి.. చివరకు 4 లక్షల మందిని పరిమితం చేశారు.
ఈ వ్యవస్థ అప్పట్లో పెను సంచలనంగా మారింది. పొరుగున్న ఉన్న తమిళనాడు, కర్ణాటక సహా.. పంజాబ్ ప్రభుత్వాలు కూడా ఏపీకి వచ్చి వలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేశాయి. తమ తమ రాష్ట్రాల్లోనూ ఇంప్లి మెంటు చేయాలని అనుకున్నాయి. కానీ, ఆయా రాష్ట్రాల్లో అమలు చేయలేదు. వలంటీర్ల వ్యవస్థను మె చ్చుకున్నప్పటికీ.. దీనివల్ల సుదీర్ఘకాలంలో ప్రజలకు-నేతలకు మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయని అంచనా వేసుకున్నారో.. ఏమో.. ఆ వ్యవస్థను అమలు చేయలేదు. ఇక, రాష్ట్రంలో వైసీపీ వలంటీర్ వ్యవస్థ ను సర్వంగా భావించింది.
ఫలితంగా ఏ కార్యక్రమం చేపట్టినా.. ఏ పథకం అమలు చేసినా.. ప్రజలతో నేరుగా వలంటీర్లు సంబంధం పెట్టుకున్నారు. తద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అంతేకాదు..అసలు తమ ఎమ్మెల్యేను లెక్కచేయని నియోజకవర్గాలు కూడా కనిపించాయి. ఇక, ఈ వ్యవస్థ లోపాలను గుర్తించే విషయంలోనూ వైసీపీ ఉదాసీనంగా వ్యవహరించిందన్న టాక్ వినిపించింది. ప్రజలకు మేలు జరిగినా.. పార్టీకి, నేతలుగా తమకు అన్యాయం జరుగుతోందని, ప్రజలు గుర్తించడం లేదని నాయకులు వాపోయారు . అయినా.. దీనినే కొనసాగించడం గమనార్హం.
కట్ చేస్తే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత..గత 15 నెలలుగా వలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని పక్కన పెడితే.. అసలు ప్రజలకు వలంటీర్లు అవసరమా? అనే చర్చ కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వలంటీర్లతో అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. వారు ఉన్నా.. లేకున్నా పనులు జరుగుతున్నాయి. ఎవరూ ఇబ్బందులు పడడం లేదని ప్రభుత్వమే చెబుతోంది. సో.. ఒకసారి ఓ వెలుగు వెలిగిన వ్యవస్థ. . ఇప్పుడు తెరచాటు అయిపోయింది. భవిష్యత్తులో కూడా వైసీపీ వలంటీర్లను దరిచేరనిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.