నాటి కాంగ్రెస్ ఆయుధమే నేడు వైసీపీకి వజ్రాయుధమా ?
రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని సెంటిమెంట్ అస్త్రాలు కూడా వాడాల్సి ఉంటుంది.;
రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని సెంటిమెంట్ అస్త్రాలు కూడా వాడాల్సి ఉంటుంది. అవే జనంలో బాగా ప్రభావం చూపిస్తాయి. కొన్ని సార్లు అధికార పక్షాలకు చుక్కలు చూపిస్తాయి. విషయానికి వస్తే వైసీపీ చేతికి ఒక వజ్రాయుధమే వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. నీటితో నిప్పులు పుట్టించడం ఒక్క రాజకీయాల్లోనే సాధ్యం. ఇపుడు అదే అస్త్రాన్ని వైసీపీ కూటమి సర్కార్ మీద గట్టిగానే ప్రయోగించబోతోంది.
ఆలమట్టి డ్యాం మళ్ళీ :
ఆలమట్టీ డ్యాం అన్నది మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో ఎంతటి రాజకీయ సంచలనం సృష్టించిందో ఆనాటి తరానికి ఎరుకే. అంతే కాదు అప్పట్లో కొత్తగా సీఎం అయిన చంద్రబాబుకే ముప్పతిప్పలు పెట్టించింది అని చెబుతారు. ఎందుకు ఇలా అంటే దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 1996లో చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయంలో యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో మధ్యేవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ ప్రభుత్వ సారధిగా ప్రధానిగా అప్పటి కర్ణాటక సీఎం దేవేగౌడను ఎంపిక చేయించి పీఠం అప్పగించారు. కేవలం 11 నెలలు మాత్రమే ప్రధానిగా ఉన్న దేవేగౌడ తన పదవీ కాలంలో కర్ణాటకలో క్రిష్ణా నది మీద కట్టిన ఆలమట్టీ డ్యాం ఎత్తుని పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. అలా అమాంతం ఆల మట్టీ డ్యాం ఎత్తు పెరిగిపోయింది. దాంతో ఆనాడు రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
దిగువకు తగ్గిన నీరు :
ఆలమట్టి డ్యాం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఉంది. 519 అడుగుల ఎత్తులో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524 అడుగులకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు ఉమ్మడి ఏపీ నష్టపోతుందని అప్పట్లో ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అయితే చివరికి నిర్మాణం జరిగింది. దాని ఫలితంగా ఆలమట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు నుంచి మరో ఐదు మీటర్లు పెంచడం ద్వారా మరో 130 టీఎంసీలు అదనంగా వాడుకునే సౌకర్యం కర్ణాటకకు లభిస్తుంది. అది తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. దీంతో దేవగౌడను ప్రధానిని చేసి రాష్ట్రానికి నష్టం చేశారని ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతలు బాబు మీద విమర్శలు చేయడంతో పాటు ఉద్యమించారు. దాని ప్రభావం 1998 లోక్ సభ ఎన్నికల మీద పడి టీడీపీకి సీట్లు బాగా తగ్గాయి.
జగన్ చేతిలో ఆలమట్టి :
కట్ చేస్తే ఇపుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలమట్టి విషయంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తాజాగా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని నిందించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోందని ఆయన అన్నారు. అయినా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని జగన్ నిందించారు. ఆలమంట్టి ప్రాజెక్ట్ ఎత్తు కనుక పెరిగితే ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎందుకు అంటూ జగన్ నిలదీస్తున్నారు.
వర్కౌట్ అవుతుందా :
నీరు ఎపుడూ సెంటిమెంట్ అస్త్రమే. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి ఇది లాభించిన అస్త్రంగా ఉంది. జగన్ ఇపుడు ఆలమట్టి అని ఎత్తుకుంటున్నారు. క్రిష్ణా జలాల లభ్యత విషయంలో ఎపుడూ ఏపీకి ఇబ్బందులే ఉన్నాయి. ఇపుడు చూస్తే ఆలమట్టితో ఏపీ నోట్లో మట్టి అని వైసీపీ అంటోంది. దీంతో కూటమి నుంచి ఏ రకమైన జవాబు ఉంటుంది. వారి వ్యూహం ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.