టీడీపీ ఎంపీ మీద వైసీపీకి మోజు ?
ఇక చూస్తే వేమిరెడ్డికి వైసీపీకి చెందిన ఒక ఎంపీ నుంచి రాయబారం వెళ్ళింది అని అంటున్నారు.;
టీడీపీలో ఉన్న ఒక బలమైన ఎంపీ మీద వైసీపీ అధినాయకత్వం మోజు పడుతోందా అంటే రాజకీయ వర్గాలలో వినవస్తున్న ప్రచారం బట్టి చూస్తే అవును అని అంటున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు ఏమా కధ అంటే ఆ టీడీపీ ఎంపీ గతంలో వైసీపీ ఎంపీ కూడా అని అంటున్నారు. ఆయన వైసీపీ ద్వారానే ఆరేళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. ఆయన అంగబలం అర్ధబలం కలిగిన వారు. వైసీపీలో ఆయన ఉన్నపుడు పార్టీకి బ్యాక్ బోన్ గా ఉండేవారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన అన్నీ తానై చూసుకునే వారు. దాంతో వైసీపీ హైకమాండ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయేది.
ఎన్నికల ముందే అలా :
అయితే 2024 ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఆయనకు ఆయన సతీమణికి రెండు టికెట్లు కోరారు అని ప్రచారం సాగింది. నెల్లూరు సిటీ టికెట్ ని తన సతీమణికి వేమిరెడ్డి కోరారని చెబుతారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ తన సన్నిహితుడికి ఆ టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో వేమిరెడ్డి ఆగ్రహించి పార్టీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీలో చేరి రెండు టికెట్లు సంపాదించారు. ఇద్దరూ గెలిచారు ఇపుడు అక్కడ ఆయన చాలా సుఖంగా ఉంటున్నారు. అయితే వైసీపీకి తాము కోల్పోయినది ఏమిటి అన్నది తెలియవచ్చింది. అందుకే వేమిరెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
రాయబారం వెళ్ళిందా :
ఇక చూస్తే వేమిరెడ్డికి వైసీపీకి చెందిన ఒక ఎంపీ నుంచి రాయబారం వెళ్ళింది అని అంటున్నారు. ఆయన పట్ల వైసీపీ అధినాయకత్వం ఎంతో ఆసక్తితో ఉందని తిరిగి పార్టీలో చేరితే కచ్చితంగా ఆదరణ ఉంటుందని చెప్పినట్లుగా రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. అయితే వేమిరెడ్డి ఏమన్నారు అన్నది తెలియదు కానీ ఆయనకు మాత్రం టీడీపీ ఎంతో గౌరవం ఇస్తోంది. దాంతో పాటు మంత్రి వర్గ విస్తరణలో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతికి చాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నుంచి ఆయన వచ్చేది ఏదీ ఉండదని అంటున్నారు.
కీలక నేతల కోసం :
అయితే వైసీపీ అధికారంలో ఉన్నపుడు పవర్ ని చూసుకుని చేసిన మార్పులు చేర్పులు తమ మాటే నెగ్గాలని పట్టిన పట్టు వంటి వాటి ఫలితంగా ఏ విధమైన చేదు ఫలితాలు వచ్చాయో స్వయంగా చూసింది అని అంటున్నారు. మంచి నేతలను పార్టీ జారవిడుచుకుంది అని అంటున్నారు. దాని వల్లనే వైసీపీ ఎన్నడూ లేని విధంగా దారుణంగా ఓటమి పాలు అయింది. అంతే కాదు నెల్లూరు జిల్లా వంటి వైసీపీ కంచుకోటలో ఒక్క సీటు కూడా గెలవకుండా చతికిలపడింది. అయితే ఇపుడు కీలక నేతల కోసం వైసీపీ చూస్తోంది. ఆ దిశగా తన ఆపరేషన్ స్టార్ట్ చేస్తోంది. కానీ ఎవరు వస్తారు, ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సిందే.