సిక్కోలు ఎంపీ కోసం వైసీపీ సీనియర్ల చూపు ?

శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుపు అన్నది వైసీపీకి ఒక చిరకాల కోరికగా మిగిలిపోయింది. వైసీపీకి వెల్లువలా విజయం దక్కిన నేపధ్యంలో కూడా ఈ సీటుని దక్కించుకోలేకపోయింది.

Update: 2026-07-15 03:34 GMT

శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుపు అన్నది వైసీపీకి ఒక చిరకాల కోరికగా మిగిలిపోయింది. వైసీపీకి వెల్లువలా విజయం దక్కిన నేపధ్యంలో కూడా ఈ సీటుని దక్కించుకోలేకపోయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నా శ్రీకాకుళం సీటు మాత్రం టీడీపీ పరం అయింది. 2014, 2019లో కూడా టీడీపీయే గెలిచింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం బలంగా వీచి టీడీపీ నుంచి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అయిపోయారు. అంతే కాదు కేంద్ర మంత్రిగా కూడా కీలక శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు.

వైసీపీకి తీరని ఆశ :

అయితే ఈ సీటు మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. కనీసం 2029 ఎన్నికల్లో అయినా ఈ సీటుని గెలుచుకోవాలని చూస్తోంది. అయితే వైసీపీకి శ్రీకాకుళంలో రాజకీయం కలిసి రావడం లేదు, బలమైన సామాజిక వర్గాల మధ్య సమతూల్యం పాటించడంలో వైసీపీ తడబడుతోంది. దాంతో పాటువైసీపీ చేస్తున్న ప్రయోగాలు కూడా గెలుపు బాటను పట్టించలేకపోతున్నాయని అంటున్నారు. 2014లో తూర్పు కాపులకు టికెట్ ఇచ్చినా ఓటమి వరించింది. 2019, 2024లో కాళింగ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చినా విజయం అన్నది లభించలేదు. దాంతో 2029 లో వైసీపీ రాజకీయ సామాజిక వ్యూహాలేంటి అన్నది అయితే చర్చగా ఉంది.

రామ్మోహన్ అసెంబ్లీకి :

ఇక టీడీపీలో చూస్తూంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ అయిదేళ్ళ పాటు కేంద్రంలోనే మంత్రిగా కొనసాగుతారు. ఆయన 2029 నాటికి అసెంబ్లీకి పోటీ చేస్తారు అని అంటున్నారు. రామ్మోహన్ యువ నాయకుడు కావడంతో పాటు చంద్రబాబు నారా లోకేష్ లకు సన్నిహితుడు. దాంతో లోకేష్ బృందంలో ఆయన కీలకంగా ఉంటున్నారు. ఇక 2029 లో ఆయన్ని అసెంబ్లీకి పోటీ చేయించి ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే మంత్రిగా తీసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. రామ్మోహన్ కూడా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఎవరు అన్నది ఒక వైపు బిగ్ డిబేట్ గా సాగుతోంది. మరో వైపు చూస్తే వైసీపీ కూడా ఇదే చాన్స్ అని అనుకుంటోంది అని చెబుతున్నారు.

గెలుపు ఆశలతో :

కింజరాపు ఫ్యామిలీకి ఉన్న పట్టు రాజకీయ వ్యూహాలతోనే వైసీపీ మూడు ఎన్నికల్లోనూ ఎంపీ సీటు గెలుచుకోలేకపోయింది అని అంటున్నారు. ఆయన తప్పుకుంటే తమకు గెలుపు సులువు అవుతుందన్న ఆశలు వైసీపీ నేతలలో ఉన్నాయని చెబుతున్నారు ఇక ఎంపీగా ఈసారి పోటీ చేయడానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా పనిచేశారు. కానీ పార్లమెంట్ కి వెళ్ళలేదు. దాంతో ఆయన ఈసారి ఎంపీగా గెలిచి తన కోరికను తీర్చుకోవాలని అనుకుంటున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదే సీటు మీద ఫోకస్ :

అదే విధంగా మరో మాజీ మంత్రి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే సీటు మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. తమ్మినేని ప్రస్తుతం శ్రీకాకుళం వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉన్నారు. ఈసారి తాను ఎంపీగా పోటీకి దిగుతాను ఆయన అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరు సీనియర్లలో ఎవరికి ఎంపీ సీటు దక్కుతుంది అన్నది చూడాల్సి ఉంది. రెండు కీలకమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతలలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ మొత్తం ఐక్యంగా గెలుపునకు కృషి చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News