యనమల ధిక్కారం వెనక కథ ఇదేనా...?
అయితే.. వాస్తవానికి.. భూములు తీసుకున్నంత మాత్రాన అదే పేరును ఉంచాలని ఏమీ లేదు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? స్థానికంగా తన హవాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానమే టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. కాకినాడ పోర్టును విస్తరించే పనులకు ఆయన సుముఖంగానే ఉన్నా.. పార్టీ పరంగా ఆయన వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. కాకినాడ పోర్టకు కోన పోర్టుగా పేరు పెట్టాలన్నది యనమల డిమాండ్. అయితే.. ఇది సాధ్యమేనా? అనేది ప్రశ్న.
పైగా ఎవరికీ లేని ఈ డిమాండ్ విషయంలో యనమల స్థానికతను పురిగొల్పుతున్నారు. పోర్టుకు అవసరమైన భూములు ఇస్తోంది కోనసీమ ప్రాంత రైతులని, కాబట్టి.. పోర్టుకు కోన పేరు పెట్టాలన్నది యనమల సూచన. ఇదే ఇప్పుడు డిమాండ్‌గా మారుతోంది. ఈ నెల 20లోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని కోన పోర్టుగా పేరు నిర్ధారించాలని.. లేకపోతే, ప్రజల ఆకాంక్షల మేరకు తాను కూడా వ్యవహరిస్తానని చెప్పు కొచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
ఇక్కడితో కూడా ఆగకుండా.. తాజాగా స్థానికులతో భేటీ కావడం మరింత ఆసక్తిగా మారింది. కోన సీమ రైతు ల నుంచి భూములు తీసుకుంటున్నారని, అలాంటప్పుడు కాకినాడ పోర్టు అని పేరు ఎందుకని ఆయన చెబుతున్నారు. అయితే.. వాస్తవానికి.. భూములు తీసుకున్నంత మాత్రాన అదే పేరును ఉంచాలని ఏమీ లేదు. ఈ విషయం తెలిసినప్పటికీ.. యనమల మాత్రం తన దారి తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఇది పెద్ద ఉద్యమంగా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రాధాన్యం కొరవడడంతోనే..
ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వంలోనూ యనమల ప్రాధాన్యం ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. గతంలో తిప్పిన చక్రం.. ఇప్పుడు మూలబడినట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీగా రిటైరైన తర్వాత.. రాజ్యసభ ఆశించారు. లేదా గవర్నర్ గిరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు చేజారుతున్నా యి. పైగా తన ముందు రాజకీయాల్లోకి వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ తనను పూర్తిగా పక్కన పెడుతోందని గ్రహిస్తున్న ఆయన.. ఇలా.. కీలక విషయాలపై ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.