ధర్మాన వారసులు పోటీకి దిగుతారా ?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న ధర్మాన సోదరులు తమ వారసులను కూడా ముందుకు తేవాలని చూస్తున్నారు.

Update: 2026-09-30 03:33 GMT

శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాలను శాసిస్తున్న ధర్మాన సోదరులు తమ వారసులను కూడా ముందుకు తేవాలని చూస్తున్నారు. 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ సీటు నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారంలో ఉంది. ఇక వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణ దాస్ కుమారుడు కృష్ణ చైతన్య వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం క్రిష్ణ చైతన్య పోలాకి తాజా మాజీ జెడ్పీటీసీగా ఉన్నారు.

వైసీపీకి కీలకం :

ఇక చూస్తే ధర్మాన కృష్ణదాస్ తన రాజకీయ వారసుడిగా కృష్ణ చైతన్యను ఇప్పటికే పలు వైసీపీ సమావేశాలలో క్యాడర్‌కు పరిచయం చేశారు. కృష్ణ చైతన్య కూడా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే స్థానిక ఎన్నికలు అన్నవి వైసీపీకి ఇపుడు అగ్ని పరీక్షగా మారుతున్నాయి. బలమైన అభ్యర్ధులను పెట్టాలని వీలైతే గెలుపు జెండా ఎగరేయాలని వైసీపీ అధినాయకత్వం పార్టీ జిల్లా అధ్యక్షులను ఇతర సీనియర్ నాయకులను కోరుతోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మేయర్, జిల్లా పరిషత్తులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ రెండు కీలక పదవులకు ధర్మాన వారసులను బరిలోకి దించుతారా లేదా అన్న చర్చ సాగుతోంది.

గతంలోనే పోటీకి :

ఇదిలా ఉంటే గతంలో అంటే 2021లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమ కుమారుడిని జెడ్పీ చైర్మన్ గా చేసుకోవాలని అపుడు మంత్రిగా ఉన్న క్రిష్ణ దాస్ ప్రయత్నించారని చెబుతారు. అయితే శ్రీకాకుళం జెడ్పీ మహిళా రిజర్వేషన్ లోకి వెళ్లడంతో ఆ చాన్స్ క్రిష్ణ చైతన్యకు రాలేదు, మరి ఇపుడు కచ్చితంగా ఓపెన్ కేటగిరీలోకి వెళ్తుందని అంటున్నారు. దాంతో క్రిష్ణ చైతన్యను పోటీకి దించితే కనుక మంచి ఫలితం ఉండొచ్చు అన్న చర్చ సాగుతోంది. మరి ఈ కీలక సమయంలో వారసుడిని దించుతారా లేదా వేరే వారిని దింపుతారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. వేరే వారిని పోటీకి దించితే మాత్రం నామ మాత్రమే అవుతుందని అంటున్నారు. అదే ధర్మాన కుటుంబంలో వారే దిగితే గట్టి పోటీకి అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఆ సాహసం చేస్తారా అన్నదే చూడాల్సి ఉంది.

మేయర్ కోసం :

ఇదే విధంగా చూస్తే 2021లో శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు పెట్టాలని వైసీపీ ఆలోచించింది. అయితే కోర్టు కేసుల వల్ల ఆగింది. అప్పట్లో మేయర్ పదవిని ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు పేరు వినిపించింది. ఇపుడు చూస్తే మేయర్ ఎన్నికలు కచ్చితంగా జరగబోతున్నాయి. మరి రామ్ మనోహర్ నాయుడు సంగతి ఏమిటి అని చర్చ సాగుతోంది. పార్టీ బలంగా ఉండాలన్నా క్యాడర్ లో ఉత్సాహం కలగాలన్నా రామ్ మనోహర్ నాయుడు పోటీకి దిగితే బాగుంటుందని అంటున్నారు. జిల్లాలొ వైసీపీకి కొత్త జోష్ తేవాలంటే ధర్మాన వారసులు రంగంలోకి దిగితే బాగుంటుంది అన్నది పార్టీ లోపల మాట కూడా అంటున్నారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News