జగన్ ఢిల్లీ టూర్ ఎపుడు ?

ఇక చూస్తే జగన్ ఢిల్లీకి వెళ్తారు అని ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లను కోరుతున్నారని ఊహాగానాలుగా కూడిన వార్తలు ఇటీవల కాలంలో వచ్చాయి.

Update: 2026-09-30 03:52 GMT

అదేంటి జగన్ విపక్షంలో ఉన్నారు కదా. ఆయనకు హస్తినతో పనేంటి అని ప్రశ్న రావచ్చు. రాజకీయ నాయకులకు ఎపుడూ పని ఉంటూనే ఉంటుంది. పైగా ఢిల్లీ జాతీయ రాజకీయాలకు రాజధాని. దాంతో పాటు ఎంతో మంది విపక్ష నేతలు ఢిల్లీ పర్యటనలు చేస్తూంటారు. అక్కడ వివిధ రాజకీయ పక్ష నేతలను కలుస్తూ ఉంటారు. జాతీయ రాజకీయ పక్షాల మద్దతుతో తమ సొంత రాష్ట్రాలలో రాజకీయాలకు పదును పెడుతూంటారు. ఉదాహరణకు చంద్రబాబుని తీసుకుంటే ఆయన 2019 నుంచి 2024 మధ్యలో అనేక సార్లు ఢిల్లీ టూర్లు పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలీ అంటే 2018 మార్చిలో అప్పట్లో ఎన్డీయేకు దూరం జరిగాక బాబు ఢిల్లీ పర్యటనలు మరింతగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యాక ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యం ఉంది. అంతే కాదు 2019 నుంచి 2024 మధ్యలో ఆయన అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏపీలో వైసీపీ ప్రభుత్వం పనితీరుని జాతీయ వేదికల మీద విమర్శించి అందరి దృష్టిలో ఉంచిన సందర్భాలు ఉన్నాయి.

జగన్ సీఎంగా ఉండగా :

ఇక వైసీపీ అధినేత జగన్ విషయం తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఎక్కువ సార్లు ఢిల్లీకి వెళ్లలేదు. పరిమితంగానే పర్యటనలు పెట్టుకున్నారు. ఒకవేళ ఢిల్లీ వెళ్ళినా కూడా ఒక రోజు కంటే ఎక్కువ ఉన్న సందర్భాలు బహు తక్కువ. 2024లో వైసీపీ ఓడాక జగన్ అదే ఏడాది ఒకసారి మాత్రమే ఢిల్లీకి వెళ్ళారు. ఏపీలో వైసీపీ నేతల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఆయన ఢిల్లీ వేదికగా చేసుకుని ధర్నా నిర్వహించారు. దానికి ఎన్డీయే కంటే ఇండియా కూటమి ఎంపీలే ఎక్కువ మంది హాజరై మద్దతు ప్రకటించారు అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత జగన్ ఢిల్లీలో అడుగుపెట్టలేదు.

ఊహాగానాలుగానే :

ఇక చూస్తే జగన్ ఢిల్లీకి వెళ్తారు అని ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లను కోరుతున్నారని ఊహాగానాలుగా కూడిన వార్తలు ఇటీవల కాలంలో వచ్చాయి. జగన్ ని కేంద్ర పెద్దలే ఢిల్లీకి పిలిచి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కోరనున్నారు అని కూడా ప్రచారం సాగింది. అయితే అవి ఏమీ జరగలేదు. దాంతో జగన్ ఢిల్లీ పర్యటన అన్నది అయితే లేకుండా పోయింది. మరి జగన్ ఢిల్లీకి ఎపుడు వెళ్తారు అన్నది మరోసారి చర్చకు వస్తోంది. ఇందంతా ఎందుకు అంటే కేంద్ర ఎన్నికల సంఘం మీద ఇపుడు జాతీయ స్థాయిలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వైసీపీ కూడా సీఈసీ పని తీరు మీద ఒకింత విమర్శనాత్మకంగా ట్వీట్లు చేస్తోంది. తన వైఖరిని వెల్లడిస్తోంది. దాంతో జాతీయ రాజకీయాల్లో వైసీపీ స్టాండ్ మారింది అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అన్నదే కొత్త చర్చగా ఉంది.

తమిళనాడు తరహాలోనే :

అయితే జగన్ ఢిల్లీ పర్యటనలకు ఎపుడూ ప్రాధాన్యత ఇవ్వరని అంటున్నారు. ఆయనతో అవసరం ఉంటే ఎవరైనా సంప్రదిస్తారని చెబుతున్నారు. తమిళనాడులో జయలలిత కానీ కరుణానిధి కానీ ఇదే విధానం అమలు చేసేవారు. తరచూ ఢిల్లీ పర్యటనలకు వారు పెట్టుకునే వారు కాదు, జగన్ కూడా అత్యవసరం అయితేనే తప్ప ఢిల్లీకి దూరమే అని అంటున్నారు. ఇపుడు కొత్తగా వెళ్ళి అక్కడ ఎవరిని కలవాలన్నది కూడా పార్టీలో అనుకుంటున్న మాట. తమ స్టాండ్ ఈసీ విషయంలో వైసీపీ చెప్పింది అంతే అని అంటున్నారు. అంతకంటే ఎక్కువ ఊహాగానాలు వద్దు అన్నదే ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. మొత్తానికి జగన్ కనుక ఢిల్లీ ఈసారి వెళ్తే మాత్రం అది జాతీయ స్థాయిలోనూ ఏపీలోనూ అతి పెద్ద రాజకీయ సంచలనాన్ని రేకెత్తించే పరిణామంగానే ఉంటుందని అంటున్నారు. మరి జగన్ ఎపుడు ఢిల్లీకి వెళ్తారు అంటే దీనిని జవాబు అయితే ఇప్పటికి ఎవరికీ లేదన్నదే నిజం.

Tags:    

Similar News