గుండ ఫ్యామిలీకి బాబు గుడ్ న్యూస్ ?
ఈ ఏడాది జనవరిలో కన్ను మూసిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ మెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి దివంగత గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత గుడ్ న్యూస్ చెబుతున్నారు అన్న టాక్ అయితే సిక్కోలు రాజకీయ వర్గాలలో ఇపుడు చర్చగా మారింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే తొట్ట తొలిగా శ్రీకాకుళం కార్పోరేషన్ కి జరగబోయే ఎన్నికల్లో మేయర్ సీటుకు గుండ కుటుంబం పేరుని పరిశీలిస్తున్నారు అన్నది. గుండ ఫ్యామిలీ టీడీపీ పట్ల కనబరచిన నిబద్ధతకు రాజకీయంగా వారు దశాబ్దాలుగా ఉంటున్నా నిజాయతీగా వ్యవహరిస్తారు అన్న పేరు సంపాదించుకున్నందుకు ప్రతిఫలంగా ఈ ఉన్నత పదవి అని అంటున్నారు. దాంతో ఇపుడు జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు.
ఎన్టీఆర్ మెచ్చిన నేత :
ఈ ఏడాది జనవరిలో కన్ను మూసిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ మెచ్చిన నేతగా పేరు తెచ్చుకున్నారు. 1983 ఎన్నికల్లో తంగి సత్యనారాయణ శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున గెలిచారు. ఆయన స్పీకర్ గా కూడా పనిచేశారు. 1984లో నాదెండ్ల భాస్కర రావు వెంట నిలిచి ఎన్టీఆర్ నుంచి దూరం జరిగారు. దాంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో న్యాయవాదిగా ఉన్న గుండ అప్పల సూర్యనారాయణకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు. అంతే కాదు ఆయన మంత్రి వర్గంలో న్యాయ శాఖ మంత్రిగా కూడా కొన్నాళ్ళ పాటు సేవలు అందించారు. వరుసగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీ దేవి 2014లో టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
టికెట్ దక్కలేదని :
అయితే 2019లో లక్ష్మీదేవి ఓటమి చెందారు. 2024లో ఆమెకు టికెట్ దక్కాల్సి ఉండగా చివరి నిముషంలో కొత్త అభ్యర్ధిగా యువ నేత గోండు శంకర్ కి చాన్స్ ఇచ్చారు. దాంతో కొంత మనస్తాపానికి గురైనా గుండ అప్పల సూర్యనారాయణ టీడీపీ విజయానికే కృషి చేశారు. ఆయన జీవించి ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చేవారు అని చెప్పుకున్నారు. కానీ ఆయన మరణంతో ఆ కుటుంబానికి రాజకీయంగా న్యాయం చేయాలని భావించిన చంద్రబాబు గుండ లక్ష్మీదేవిని మేయర్ అభ్యర్ధిగా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం గుండ ఫ్యామిలీకి శ్రీకాకుళంలో ఉన్న రాజకీయ పలుకుబడి అన్నీ కలిస్తే సులువుగా విజయం తధ్యం అని భావిస్తున్నారు.
వైసీపీకి ఇబ్బందే :
గుండ లక్ష్మీదేవి కుటుంబానికి శ్రీకాకుళం పట్టణంలో పట్టు ఎక్కువగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా వైసీపీ అభ్యర్ధి ధర్మాన ప్రసాదరావుకు కేవలం అయిదు వేల మెజారిటీ మాత్రమే దక్కింది. ఇక శ్రీకాకుళం పట్టణంలో గుండ లక్ష్మీదేవికే వేయి కోట్ల మెజారిటీ వచ్చింది. శ్రీకాకుళం, గార మండలంలలో ఆరు వేల మెజారిటీ రావడంతో ధర్మాన అయిదు వేల ఓట్ల విజయం సాధించారు. అంటే శ్రీకాకుళంలో గుండ ఫ్యామిలీకి అంత బలం ఉంది అని గుర్తించే టీడీపీ కూడా ఆమెకు చాన్స్ ఇవ్వాలని చూస్తోంది. దీని వల్ల గుండ కుటుంబానికి న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. గుండ ఫ్యామిలీ పోటీకి దిగితే బలమైన అభ్యర్ధిని నిలబెట్టడం వైసీపీకి కష్టసాధ్యమే అవుతుందని అంటున్నారు.