సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లతో ప్ల‌స్సెంత‌.. మైన‌స్సెంత‌..?

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లుగా కొంతమందిని తీసుకుని వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన.

Update: 2026-09-30 02:45 GMT

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లుగా కొంతమందిని తీసుకుని వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే జీవో కూడా జారీ చేశారు.ఇన్‌ఫ్లుయెన్స‌ర్లకు ఏ మేరకు పారితోషికులు ఇవ్వాలి ఎలా నియమించుకోవాలి అసలు ఎవరెవరిని తీసుకోవాలి అనే సమగ్ర వివరాలతో ఈ జీవో వచ్చింది. అయితే ఇప్పుడు అసలు సమస్య ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఇన్‌ఫ్లుయెన్స‌ర్లను నియమించుకోవడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేకపోయినప్పటికీ వారు చేసే ప్రచారం కొంత పాజిటివ్ వ్యవహారమే అయ‌నా.. మరింతగా నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉందన్నది టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సహజంగా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు అంటే రెచ్చిపోయి మాట్లాడుతారు. ప్రభుత్వానికి ఇది మంచి పేరు తీసుకొస్తుంది. కానీ ఇదే సమయంలో అర్హత ఉండి కూడా పథకాలకు దూరమైన వర్గాలకు ఈ ప్రచారం తీవ్రంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని టిడిపి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 100 మంది అర్హత కలిగిన వారు ఉంటే వారిలో ఇప్పుడు సగం మందికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ, ఇప్పుడు వారంతా ఒక రకంగా మరిచిపోయారు. వస్తే వస్తాయి లేకపోతే లేదు అన్నధోర‌ణిలో చాలామంది సంక్షేమ పథకాలపై ఆలోచన చేస్తున్నారు.

కానీ, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల ప్రభావం.. పథకాలు అందని వారిపై పడే అవకాశం ఉందని టిడిపి నాయకులు సహా కొంతమంది సలహాదారులు చెబుతున్నారు. సహజంగానే పదిమందికి పథకాలు వచ్చి 11వ వ్యక్తికి అర్హత ఉండి కూడా రాకపోతే ఆ వ్యక్తి తీవ్రంగా ఆవేదన‌ చెందుతాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల కారణంగా ఈ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండొచ్చు అనేది సలహాదారులు చెబుతున్న మాట. ముఖ్యంగా ఆర్థిక సలహాదారుగా ఉన్న కుటుంబరావు ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారని టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇన్‌ఫ్లుయెన్స‌ర్లను అన్ని విషయాల్లోనూ ఉపయోగించుకోవడం వల్ల కొన్ని వర్గాలు మనకు దూరమయ్యే అవకాశం ఉంటుందని ఆయన చూచాయగా తన లేఖలో ప్రస్తావించినట్టు టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల ప్రభావం కొంతవరకు ప్రభుత్వానికి మేలు చేసినప్పటికీ అదే సమయంలో కొంత వ్యతిరేక ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనినిబట్టి ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు అవసరం లేదని, ఇన్‌ఫ్లుయెన్స‌ర్లుతో పనిలేదని గాని ఎవరూ చెప్పటం లేదు. కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో భారీ ప్రచారం చేసుకుంటే అవి అందని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని మాత్రమే హెచ్చరిస్తున్నారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కూడా టిడిపి నాయకులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News