శివుడు వర్సెస్ రాముడు....కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ఆస్తికులకు నాస్తికులకు మధ్య యుగాల నుంచి జరుగుతూ వస్తోంది.
దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ఆస్తికులకు నాస్తికులకు మధ్య యుగాల నుంచి జరుగుతూ వస్తోంది. అది ఎప్పటికీ తేలే వ్యవహారం కాదు, ఎవరి లాజిక్ వారిది. ఎవరి నమ్మకాలు వారివి. అందువల్ల దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడంటే లేడు. అయితే ఇపుడు దేవుడి విషయంలో మరో కొత్త చర్చ మొదలైంది. అదే పేద దేవుడు, పెద్ద దేవుడు అంటూ సాగుతున్న ఈ చర్చను అనడం కన్నా రాజకీయ రచ్చ అనడం సబబేమో. దేవుళ్లలో డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు అని ఆర్థిక విభజన చేయడమే అసలైన రాజకీయం. అది కూడా శివుడు, రాముడు అంటూ పోటీ పెట్టి మరీ ఈ విధంగా సరికొత్త చర్చకు కాంగ్రెస్ ఆస్కారం కల్పించింది.
శివుడు పేద వాడు :
తెలంగాణాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆయన అన్నదేంటి అంటే శివుడు పేదవాడు అని. ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద గొప్ప అంతరమే కాదు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సాంస్కృతిక రాజకీయ వ్యత్యాసాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఉత్తర భారతీయులు ఆర్యులని వారు శ్రీరాముడిని పూజిస్తారని దక్షిణ భారతీయులు ద్రావిడులని తాము శివుడి భక్తులమని రేవంత్ రెడ్డి స్పష్టంగా సాంస్కృతిక విభజన చేశారు. అంతే కాకుండా బీజేపీపై విమర్శలు చేస్తూ బీజేపీ పార్టీ శ్రీరాముడిని ఒక రాజకీయ చిహ్నంగా వాడుకుంటూ సెంటిమెంట్‌తో ఓట్లు దండుకుంటోందని తీవ్రంగానే విమర్శించారు. బీజేపీ కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే అంటుందని హర హర మహాదేవ అని ఎందుకు అనరని రేవంత్ రెడ్డి సూటిగానే ప్రశ్నించారు.
బీజేపీ డబ్బున్న పక్షం :
ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ మీద సాంస్కృతిక పరమైన అంతరం చూపిస్తూ విమర్శలు చేయడమే కాదు డబ్బున్న పార్టీ అని అందుకే రాముడు పక్షం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు శ్రీరాముడు ధనికులకు ప్రాతినిధ్యం వహిస్తాడని శివుడు పేదలకు ప్రాతినిధ్యం వహిస్తాడని చెబుతూ దేవుళ్ళ మధ్య కూడా ఆర్ధిక వ్యత్యాసం తెచ్చారు. దీంతో ఇది అతి పెద్ద రాజకీయ దుమారం గానే మారింది. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మధ్య కూడా రాజకీయాలు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోనే వేములవాడ దక్షిణ కాశీగా ఉంటుందని, అది శివుడు క్షేత్రం అని గుర్తు చేశారు. అలాగే భద్రాచలం దక్షిణ అయోధ్యగా శ్రీ రాముడి ఆలయంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇవే కాదు అనేకమైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేశంలో అన్ని చోట్లా ఉన్నాయని చెప్పారు. ఈ విధంగా హిందూ సమాజాన్ని విడదీయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ కామెంట్స్ :
ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్ధించారు. శివుడు ఏ ఆభరణాలు లేకుండా పేద దేవుడిగా ఉంటారని చెప్పారు. అలాగే శ్రీరాముడు ఆభరణలతో ఆడంబరంగా ఉంటారని చెప్పారు. ఏది ఏమైనా ఈ ఇద్దరు దేవుళ్లను తాము ఆరాధిస్తామని ప్రార్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే దేవుళ్లకు ప్రాంతాలు ఆర్ధిక వ్యత్యాసాలు ఉంటాయా అన్నది ఆస్తిక జనుల మధ్య చర్చ మొదలైంది. రాజకీయాల్లోకి దేవుళ్లను కూడా తేస్తున్నారు ఎందుకు అన్నది కూడా వినిపిస్తోంది.
ఆది బిక్షువుగానే :
ఇక పురాణాల పరంగా చూస్తే శివుడుని ఆది బిక్షువు అని అంటారు. ఆయన ఒంటి మీద పులి చర్మం ఉంటుంది. ఆయన నివాసం శ్మశానంగా ఉంటుంది. ఆయన పామునే ఆభరణంగా ధరిస్తాడు. ఇది ఒక ప్రతీకగానే ఆధ్యాత్మికత చెబుతుంది. వైరాగ్యానికి వేదాంతానికి శివుడిని సంకేతంగా చూస్తారు. శివుడు లయ కారుడిగా కనిపిస్తారు. మానవ జీవిత పరిణామ క్రమంలో వివిధ దశలు దాటిన తరువాత రావాల్సింది వైరాగ్యమే అని చాటి చెప్పేందుకు శివుడి అవతారం కనిపిస్తుంది. ఇలా పురాణాలలో సూక్షం ఎంతో ఉంది. అయితే వీటిని పేద ధనిక దేవుళ్ళుగా అలాగే సాంస్కృతిక వాదాలుగా మార్చడం అంటే రాజకీయాల కోసమే తప్ప అసలు నిజం అది కానే కాదని అంటారు ఆధ్యాత్మికపరులు.