వర్మ, కొలికపూడి వైసీపీలోకి..? ఇంకా అర్థం చేసుకోలేదా?

కొద్దిరోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ వార్త ఆసక్తి రేపుతోంది. అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ తీరు మారలేదా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.;

Update: 2025-04-01 04:09 GMT

కొద్దిరోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ వార్త ఆసక్తి రేపుతోంది. అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ తీరు మారలేదా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. విఫలమైన ప్రయోగాలే మళ్లీ మళ్లీ చేయడం ద్వారా ఏం లాభమనే ప్రశ్న తలెత్తుతోంది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాతోపాటు డిజిటల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంచి ఆసక్తికర థంబ్ నెయిల్ ద్వారా వీడియోలు చేస్తున్నా, వాటిని ప్రజలు నమ్ముతారా? ఆ ప్రచారం ద్వారా ప్రత్యర్థులపై పైచేయి సాధించడం సాధ్యమా? అనేది చూసుకోవాల్సిందికదా? అనే చర్చ జరుగుతోంది.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు చాలా వివాదాస్పదంగా మారుతోంది. పది నెలల నుంచి ఆయనకు స్థానిక తెలుగుదేశం కేడర్ కు పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానం ముందు నిల్చొవాల్సివస్తోంది. తాజాగా కూడా తిరువూరుకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేతపై చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ కొలికపూడి పెద్ద దుమారం రేపారు. దీనిపై ఆ పార్టీలో చాలా చర్చ జరిగింది. అదేసమయంలో ఈ వివాదంపై అధిష్టానం ఫోకస్ చేయడంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అయిపోయారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నామినేటెడ్ పదవి విషయంలో కూడా కూటమి మధ్య కొట్లాట జరుగుతోంది.

ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వాల్సిందేనని టీడీపీ సోషల్ మీడియా అధిష్టానంపై ఒత్తిడి చేస్తోంది. కానీ, పది నెలలుగా ఎదురుచూపులే తప్ప, ఆయనకు ఏ పదవీ దక్కడం లేదు. మరోవైపు పుండు మీద కారం జల్లినట్లు వర్మపై జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తుండటం, డిప్యూటీ సీఎం పవన్ గెలుపులో వర్మ పాత్ర లేదంటూ ప్రకటనలు చేస్తుండటంతో దుమారం చలరేగుతోంది. ఈ రెండు కూటమి ప్రభుత్వ అంతర్గత విషయాలు కాగా, ఎమ్మెల్యే కొలికపూడి కానీ, మాజీ ఎమ్మెల్యే వర్మ కానీ పార్టీ లైన్ అతిక్రమించే ప్రకటనలు చేయడం లేదు. కొలికపూడి తొందరపాటులో ఏమైనా అన్నా వెంటనే సరిచేసుకుని అధిష్టానానికి జీ హుజార్ అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై స్వయంగా పాటపాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో కొలికపూడి, వర్మ పార్టీ మారతారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

అధికారంలోకి వచ్చి పది నెలల్లోనే ఇద్దరు ప్రధాన నేతలు ప్రతిపక్షం వైపు వెళ్లడమంటే అంత సులువుగా జరుగుతుందా? అనేది చూసుకోకుండా వ్యవహరించడం సెల్ఫ్ గోల్ అవుతుందని అంటున్నారు. తనకు పదవి లేకపోయినా చంద్రబాబు సైనికుడిగా ఉంటానంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించడాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. వర్మ, కొలికపూడి పూర్తిగా పార్టీ విధేయుల్లా వ్యవహరిస్తున్నా, వైసీపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ మీడియా ప్రచారం చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగమని ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఇద్దరూ కనీసం వైసీపీలో ఎవరితోనైనా సంప్రదించకుండానే అసత్యాలు ప్రచారం చేయడం వల్ల పార్టీ పరువు బజారును పడుతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రచారం చేయడం వల్ల వాపు ఏదో బలం ఏదో తెలుసుకోలేకపోయామని ఇప్పుడు కూడా అదే పంథా అనుసరించడం కరెక్టు కాదని అంటున్నారు.

వైసీపీ కంటెంట్ కన్సల్టెంట్లు ఎవరో గానీ, తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం వల్ల పార్టీకి జరిగే మేలు ఏంటో గుర్తించడం లేదని వైసీపీ శ్రేణులు నిరసిస్తున్నాయి. మరో నాలుగేళ్లు అధికారం వదులుకుని ఎవరైనా వస్తున్నారంటే, దానికి తగిన ఆధారాలు చూపాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదీ లేకుండా అసత్య, అసమగ్ర అంశాలను ఎంచుకోవడం వల్ల పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధిష్టానం అప్రమత్తంగా వ్యవహరించి ఈ తరహా కంటెంటును ప్రచారం చేయకుండా ఉండటమే బెటర్ అంటూ కార్యకర్తలు సలహాలిస్తున్నారు.

Tags:    

Similar News