రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. ఆ 60 నియోజకవర్గాల్లో ఎలా?

అధినేత జగన్ పిలుపు మేరకు శుక్రవారమే వైసీపీ శ్రేణులు ‘‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.;

Update: 2025-06-28 08:38 GMT
రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. ఆ 60 నియోజకవర్గాల్లో ఎలా?

ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ ప్రతిపక్షం వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ‘‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పార్టీ అధినేత జగన్ బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాలన ముగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జులై నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ఏడాదిలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై వివరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ కార్యక్రమం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం కంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లి కూటమి పార్టీల చేతిలో ప్రజలు ఎలా మోసపోయారో చాటిచెప్పాలనేది ఆ కార్యక్రమం ఉద్దేశం. దీంతో రెండు పక్షాల కార్యక్రమాల నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అధినేత జగన్ పిలుపు మేరకు శుక్రవారమే వైసీపీ శ్రేణులు ‘‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ఈ కార్యక్రమం ఎన్ని నియోజకవర్గాల్లో జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం దాదాపు 60 నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వమే లేకపోయిందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు ఇన్ చార్జిలను మార్చడంతో చాలా చోట్ల ఇప్పుడు ఖాళీలు ఏర్పడ్డాయని అంటున్నారు.

గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చే క్రమంలో వైసీపీ అధినేత దాదాపు 80 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. అప్పట్లో కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా, మరికొందరిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేశారు. అయితే కొత్తగా పోటీకి దిగిన అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిన అనంతరం పార్టీ వైపు చూడటమే లేదన్న టాక్ వినిపిస్తోంది. గెలిస్తే ఎమ్మెల్యే అవుదామని భావించిన వారు.. ఓడిపోయాక పార్టీని ఐదేళ్లు నడపడం భారంగా భావించి పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని అంటున్నారు. మరికొన్ని చోట్ల స్థానికేతర నేతలు నియోజకవర్గ ఇన్చార్జి పదవుల్లో ఉండటంతో వారు కూడా పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రాష్ట్రంలో దాదాపు 60 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహణ సాధ్యమయ్యేలా లేదన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News