వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందా...తగ్గుతోందా ?

ఈ రెండూ కూడా గతానికి భిన్నంగా పరుగులు అందుకుంటున్నాయి. ఎప్పటికి పూర్తి అవుతుందని అంటే దానికి కూడా కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ డేటూ టైం చెబుతోంది.

Update: 2026-05-17 03:49 GMT

ఏపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్ళు పూర్తి అయిపోయాయి. 2024 మే 13న ఏపీ ఫలితాన్ని జనాలు ఈవీఎంలలో వేశారు. అంటే ఇప్పటికి ఆ డేట్ తిరిగినట్లే కదా. ఇక జూన్ 4న ఈవీఎంల నుంచి ఫలితాలు వచ్చాయి, వైసీపీ ఓటమి భారీ స్థాయిలో ఉండి చతికిలపడింది. కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. అదే విధంగా టీడీపీ కూటమికి 164 సీట్లు దక్కి బంపర్ విక్టరీని కొట్టింది. దాంతో జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రమాణం చేసింది. ఇక ఈ రెండేళ్ళలో ఏపీలో ఏమి జరిగింది అన్నది చూస్తే కనుక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమి చేసింది అంటే ఆ పార్టీ నేతలు కానీ ముఖ్యమంత్రి మంత్రులు చెబుతున్నది కానీ చూస్తే అర్ధం అవుతోంది. ఏపీలో అభివృద్ధి పట్టాలెక్కే కార్యక్రమం అయితే సాగుతోంది అని అంతా చెబుతున్నారు. దానికి సంబంధించిన కదలిక అయితే కళ్ళకు కనిపిస్తోంది.

అమరావతి ప్లస్ పోలవరం :

ఈ రెండూ కూడా గతానికి భిన్నంగా పరుగులు అందుకుంటున్నాయి. ఎప్పటికి పూర్తి అవుతుందని అంటే దానికి కూడా కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ డేటూ టైం చెబుతోంది. ఆ సమయానికి అటూ ఇటూ అయినా పని జరుగుతోంది కాబట్టి ఆ మేరకు జనాలకు కొంత సంతృప్తి ఉన్నట్లే అని అంటున్నారు. అలాగే ఏపీలో మూడు ప్రాంతాలలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయి. అది రాయలసీమ కానీ అలాగే ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ పరిశ్రమలు అయితే ఏర్పాటు అవుతున్నాయి. అవి ఎపుడు పూర్తి అవుతాయన్నది పక్కన పెడితే పునాది రాయి పడుతోంది కాబట్టి జనాల ఆశలు కూడా వాటి మీద ఉంటూ సజీవంగానే కొనసాగుతాయని చెప్పక తప్పదు. అదే విధంగా కూటమి పార్టీలు ఫుల్ యాక్టివ్ గా ఉన్నాయి. మూడు పార్టీలు సభ్యత్వ నమోదు పూర్తి చేశాయి. క్యాడర్ తో సాన్నిహిత్యం పెంచుకున్నాయి. బలాలను విస్తరించుకుంటున్నాయి. అదే సమయంలో వైసీపీ మీద ముప్పేట దాడి చేస్తున్నాయి.

వైసీపీ ఏమి చేసింది :

ఈ రెండేళ్ళ కాలంలో చూసుకుంటే వైసీపీ ఒక ప్రతిపక్షంగా ఏమి చేసింది అంటే ఆలోచించాల్సిందే అన్న జవాబు వస్తోంది. మాజీ సీఎం జగన్ అయితే అసెంబ్లీ ముఖం చూడడం లేదు, ఇది మొదట్లో ఏమో అనుకున్నా రాను రానూ మాత్రం జనాలలో నెగిటివిటీని పెంచుతోంది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా లేక అసంతృప్తి ఉన్నా తన గొంతుకగా విపక్షం నిలబడి ప్రశ్నించాల్సిన వేదిక అసెంబ్లీ. మరి అక్కడ వైసీపీ కనిపించడం లేదు. ప్రజలు అయితే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. కానీ వైసీపీ తానుగా తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ అదృశ్యం అయిపోయింది. అది ఆ పార్టీ చేసుకున్న స్వీయ తప్పిదం. ఈ విధంగా చూస్తే కనుక జగన్ మీద విపక్ష నేతగా ఈ రెండేళ్ళలో మార్కులు పడకపోగా యాంటీ ఇంకెంబెన్సీ ఈ వైపుగా రావడమే విశేషం.

ఉద్యమాలు లేవు :

ఎన్నో ప్రజా సమస్యలు ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా నూరు శాతం పని చేయలేదు. అలాంటి వాటిని ఎత్తుకుని జనంలోకి వెళ్ళాలి. వైసీపీ అయితే ఆ పనిని పూర్తిగా పక్కన పెట్టేసింది. జగన్ అయితే పెద్దగా జనంలోకి రావడమే మానుకున్నారు. ఆయన ఒకే ఒక్క అస్త్రాన్ని అమ్ముల పొదిలో పెట్టుకున్నారు. అదే పాదయాత్ర. అది తనను అధికారంలోకి తెస్తుందని భావిస్తున్నారు కానీ పార్టీ అంటే నిరంతరం కార్యక్రమాలు ఉండాలి. అధినేత ఒక్కరే ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తే సరిపోదు, గ్రాస్ రూట్ లెవెల్ లో బలంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. అలాంటి పార్టీ నిర్మాణం సంస్థాగతంగా వైసీపీ చేసుకోలేకపోతోంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి రావడంలేదు అన్న చర్చ సాగుతోంది.

రెండు సార్లు జనాలు ఓడించారు :

దానికి తోడు 2024లో ఏ సెక్షన్లు అయితే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని దగ్గరకు తీయడం కానీ వారిని ఆకట్టుకోవడం కానీ వైసీపీ ఈ రెండేళ్లలో చేసింది లేదని అంటున్నారు. వైసీపీ ఇంచార్జిలు కానీ మాజీ మంత్రులు కానీ నాయకులు కానీ నమ్మేది ఒక్కటే. కూటమి వైఫల్యాలే తమకు అధికారాన్ని బంగారం పళ్ళెంలో తెచ్చి పెడతాయని. కానీ పొరుగున ఉన్న తమిళనాడులో అన్నా డీఎంకేని రెండు సార్లు జనాలు ఓడించారు అన్నది గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. మూడవ ఏడాదిలోకి కూటమి ప్రభుత్వం ప్రవేశిస్తున్న వేళ వైసీపీ ఇప్పటికైనా జనంలోకి అసెంబ్లీలోకి వెళ్ళకపోతే మాత్రం అన్ని వర్గాలతో కలివిడితనం గా ఉండకపోతే మాత్రం 2029 లో ఇబ్బందులే అని రాజకీయ విశ్లేషణలు అయితే ఉన్నాయి.

Tags:    

Similar News